Dhanush: ధనుశ్ కి భయం లేదు .. ఎందుకంటే ఆయన రిజల్టును పట్టించుకోడు: త్రివిక్రమ్

  • 'సార్' సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్న త్రివిక్రమ్ 
  • తనకి ఈ సినిమా అందుకే నచ్చిందంటూ వివరణ 
  • గురువులా ఈ సినిమా గుర్తుండి పోతుందని వెల్లడి
  • ధనుశ్ ను ప్రశంసలతో ముంచెత్తిన త్రివిక్రమ్
Sir Pre Release Event

ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్' సినిమాకి త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ .. "కోవిడ్ సమయంలో వెంకీ అట్లూరి నాకు ఈ కథ చెప్పాడు .. ధనుశ్ కి చెబుతానని అన్నాడు. ఆయనను నిరాశ పరచడం ఎందుకని అలాగే కానివ్వమని అన్నాను. కథ వినగానే ధనుశ్ ఓకే అనడం .. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడం జరిగింది" అని చెప్పారు. 

"విద్య - వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ వాటిని సామాన్యులకు దూరంగా తీసుకుని వెళ్లే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. డబ్బులేదనే కారణంగా చదువుకునే హక్కు లేదనడం ఎంతవరకూ కరెక్ట్ అనేది ఈ సినిమా ద్వారా వెంకీ ప్రశ్నించాడు. అందుకే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది" అన్నారు. 

' డబ్బును బట్టి వీళ్లు చదువుకోగలరు .. వాళ్లు చదువుకోలేరు అనే అడ్డు గీతలను ఎల్ కేజీ నుంచే గీసేస్తున్న రోజులివి. ఇలాంటి ఒక సిస్టమ్ ను కరెక్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా హైదారాబాద్ వచ్చిన కొత్తల్లో ట్యూషన్స్ చెప్పుకునే బ్రతికాను. ఒక టీచర్ కీ .. స్టూడెంట్ కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందనేది నాకు తెలుసు. మన గురువులానే ఈ సినిమా కూడా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చెప్పారు. 

"శివాజీ గణేశన్ .. కమల్ తరువాత తరంలో నేను ధనుశ్ కి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాను. ఒక సినిమా జయాపజయాలకు సంబంధించిన భయం ఆయనలో లేదు. వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాడు .. రిజల్టును పట్టించుకోడు. భాష పేరుతో ఇప్పుడు అడ్డుగోడలు లేవు .. ధనుశ్ మనందరివాడు. ప్రేమవర్షాన్ని కురిపించి 'సార్'ను భుజాలకు ఎత్తుకుందాం" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News