Cricket: మహిళల ప్రీమియర్​ లీగ్​ షెడ్యూల్​ విడుదల.. తొలి మ్యాచ్​లో ఎవరితో ఎవరంటే!

BCCI releases schedule for the inaugural edition of Womens Premier League
  • మార్చి 4న గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి పోరు
  • మార్చి 26న జరిగే తుదిపోరుతో ముగియనున్న టోర్నీ
  • బరిలో ఐదు జట్లు.. మొత్తం 22 మ్యాచ్ లు
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) క్రికెటర్ల వేలాన్ని విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ ఈ లీగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు ఈ లీగ్‌ జరగనుంది. ఐదు జట్లు బరిలో నిలిచిన తొలి ఎడిషన్‌లో మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో 20 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు నాకౌట్‌ మ్యాచ్‌లు (ఎలిమినేటర్‌, ఫైనల్‌) ఉన్నాయి. ముంబైలోని డీవై పాటిల్‌, సీసీఐ బ్రబౌర్న్‌ స్టేడియాలు చెరో 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మార్చి 4న (శనివారం) గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ తో డబ్ల్యూపీఎల్ కు తెరలేనుంది. తర్వాతి రోజు (ఆదివారం) తొలి డబుల్ హెడర్ (ఒక రోజు రెండు మ్యాచ్ లు) ఆర్‌సీబీ–ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌–గుజరాత్‌ జెయింట్స్‌ తలపడతాయి.

ఈ సీజన్‌లో మొత్తం నాలుగు డబుల్‌ హెడర్స్‌ ఉన్నాయి. అందులో తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30కి మొదలవుతుంది. రాత్రి మ్యాచ్‌లు 7.30 నుంచి జరుగుతాయి. లీగ్ దశలో చివరి పోరు మార్చి 21న  బ్రబౌర్న్‌లో యూపీ, ఢిల్లీ మధ్య జరుగుతుంది. లీగ్‌ స్టేజ్‌లో ఒక్కో జట్టు మిగతా నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశలో అగ్రస్థానం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుతుంది. 2, 3వ స్థానాల్లో నిలిచిన జట్లు మార్చి 24న డీవై పాటిల్‌ స్టేడియంలో ఎలిమినేటర్‌లో పోటీ పడతాయి. ఇందులో గెలిచిన జట్టుతో లీగ్ దశ టాపర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఫైనల్ మ్యాచ్ ను మార్చి 26న బ్రబౌర్న్‌ స్టేడియంలో షెడ్యూల్ చేశారు.
Cricket
BCCI
WPL
schedule

More Telugu News