Nykaa: న్యూఏజ్ స్టాక్స్ పై మ్యూచువల్ ఫండ్స్ లో ఆసక్తి

  • జనవరిలో జొమాటో, నైకా, పేటీఎంలో పెట్టుబడులు
  • గరిష్ఠ వ్యాల్యూషన్ల నుంచి దిగొచ్చిన వీటి షేర్లు
  • దీర్ఘకాలానికి ఆకర్షణీయంగా భావించి కొనుగోలు చేస్తున్న సంస్థలు
Nykaa Zomato Paytm among top stock picks of mutual funds

జొమాటో, పేటీఎం, నైకా.. నూతన తరం కంపెనీలుగా వీటికి పేరు. ఇవన్నీ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ల అండతో వ్యాపారం నిర్వహించే సంస్థలు. తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకునే సామర్థ్యం కలిగినవి. మొబైల్ సాయంతో ఈ కంపెనీల సేవలను సులభంగా పొందొచ్చు. అందుకే జొమాటో, నైకా ఐపీవోలకు ఊహించనంత స్పందన వచ్చింది. ఆ తర్వాత అంతే వేగంగా ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఆవిరి అయిపోయింది. అమెరికాలో టెక్నాలజీ స్టాక్స్ భారీ పతనంతో.. మన దేశంలోనూ ఈ కంపెనీల షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు తెగ అమ్మేశారు. దీంతో గరిష్ఠ స్థాయి నుంచి ఇవి 50-70 శాతం మధ్య నష్టపోయాయి. 

ప్రస్తుతం రెండో ఎపిసోడ్ మొదలైందని చెప్పుకోవాలి. మొదట ఈ కంపెనీల పట్ల అసాధారణ ఆసక్తి ఉంటే, ఆ తర్వాత మార్కెట్లో దిద్దుబాటుతో అది ఆవిరైపోయింది. ఫలితంగా సరైన వ్యాల్యూషన్లకు ఈ కంపెనీల విలువలు దిగి వచ్చాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు భవిష్యత్తు దృష్ట్యా ఈ కంపెనీలను ఆకర్షణీయంగా భావిస్తూ వాటాలు పెంచుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

జనవరిలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు.. నైకా (ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్)లో 2.96 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి. ఎస్ బీఐ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా, మిరాయ్ కొనుగోలు చేసిన వాటిల్లో ఉన్నాయి. జొమాటోలో మ్యూచువల్ ఫండ్స్ 3.47 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి. పేటీఎం షేర్లను ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, మిరాయ్ అస్సెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హెచ్ డీఎఫ్ సీ మ్యూచువల్ ఫండ్, యూటీఐ, నిప్పన్ ఇండియా కొనుగోలు చేశాయి. ‘‘దీర్ఘకాలంలో ఈ కంపెనీలు భారీగా వృద్ధి చెందగలవు. కనుక స్వల్పకాలంలో సవాళ్లు ఉన్నప్పటికీ ఇటీవల దిద్దుబాటు తర్వాత వీటి కొనుగోళ్ల పట్ల ఆసక్తి ఏర్పడింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు.

More Telugu News