bbc: ఐటీ సోదాలపై ఉద్యోగులకు బీబీసీ తాజా లేఖ

BBCs Latest Mail To Staff As Income Tax Officials Scan Its India Offices
  • అధికారులకు సహకరించాలని సూచన
  • జీతం వివరాలు అడిగితే చెప్పాలన్న సంస్థ
  • బ్రాడ్ కాస్టింగ్ శాఖలో పనిచేసే వాళ్లు మాత్రమే ఆఫీసుకు రావాలని ఆదేశం
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం మొదలైన సోదాలు.. రాత్రి తెల్లవార్లూ జరిగాయని, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ పంపిన బీబీసీ.. తాజాగా మరో లేఖను పంపింది. అవసరమైన వారు.. అంటే బ్రాడ్ కాస్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారు మినహా మిగతా వారు ఆఫీసుకు రానక్కర్లేదని చెప్పింది. ఇంటి వద్ద నుంచే పనిచేయాలని మెయిల్ లో సూచించింది.

ఐటీ అధికారుల సోదాలకు సహకరించాలని మరోమారు సూచించింది. జీతానికి సంబంధించిన వివరాలను అడిగితే చెప్పాలని పేర్కొంది. అయితే, వ్యక్తిగత ఆదాయ వివరాలు అడిగినా చెప్పాల్సిన అవసరంలేదని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, పన్ను ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతోనే బీబీసీ ఆఫీసుల్లో సర్వే చేస్తున్నట్లు ఐటీ అధికారులు మంగళవారం వెల్లడించారు.

పలు అంశాలకు సంబంధించి సంస్థ లెక్కల్లో చూపించిన ఖర్చులపై సందేహాలు ఉన్నాయని అన్నారు. వాటిని నివృత్తి చేసుకోవడానికి బీబీసీ అకౌంట్స్ బుక్స్ ను, బ్యాలెన్స్ షీట్ తదితర అకౌంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవి సోదాలు కాదని, సర్వే మాత్రమేనని ఐటీ వర్గాలు స్పష్టం చేశాయి.
bbc
it searches
delhi
mumbai
email
employees

More Telugu News