KCR: నేడు కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన

  • ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి పయనం
  • బేగంపేట నుంచి హెలికాప్టర్ లో ప్రయాణం
  • మంగళవారమే కొండగట్టు వెళ్లాలనుకున్న కేసీఆర్
  • భక్తుల రద్దీ ఉంటుందన్న కారణంతో పర్యటన నేటికి వాయిదా
CM KCR will visit Kondagattu temple today

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్నారు. వాస్తవానికి నిన్ననే కొండగట్టులో పర్యటించాల్సి ఉన్నా, మంగళవారం నాడు ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో పర్యటన నేటికి వాయిదా పడింది. 

ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి పయనమవుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కొండగట్టుకు బయలుదేరి, ఉదయం 9.40 గంటలకు కొండగట్టు చేరతారు. కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు. 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత వైభవంతో పునర్ నిర్మించింది. ఇదే తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని కేసీఆర్ సంకల్పించారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. 

యాదాద్రి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలు కూడా అప్పగించినట్టు తెలుస్తోంది. ఆనంద్ సాయి ఇటీవల ఆలయాన్ని పర్యటించి, పలు అంశాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఆలయ వివరాలు తెలుసుకున్నారు.

More Telugu News