Supreme Court: హైదరాబాద్ క్రికెట్ సంఘం కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు

  • హెచ్ సీఏ కార్యకలాపాలపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు
  • తాజాగా ఏకసభ్య కమిటీ నియామకం
  • మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కమిటీ
  • కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు ఉంటాయన్న సుప్రీంకోర్టు
Supreme Court quashed Hyderabad Cricket Association Committee

గత కొన్నాళ్లుగా హైదరాబాద్ క్రికెట్ సంఘం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. పాలకవర్గంలో లుకలుకలు, ఆర్థిక అవకతవకలు, మ్యాచ్ ల నిర్వహణలో అక్రమాలు, అవినీతి... ఇలా అనేక అంశాలకు హెచ్ సీఏ వేదికగా మారింది. అటు, దేశవాళీల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారైంది. 

ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ప్రక్షాళనకు ఉపక్రమించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమిస్తూ సుప్రీం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సభ్యుడిగా ఉంటారు. 

ఇకమీదట హెచ్ సీఏ కార్యకలాపాలు ఈ ఏకసభ్య కమిటీనే చూసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ రూపొందించే నివేదికను పరిశీలించిన తర్వాత, తమ తదుపరి చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. 

ఒకప్పుడు అజహరుద్దీన్, ఎంఎల్ జయసింహ, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు వంటి ప్రఖ్యాత క్రికెటర్లను అందించిన హైదరాబాద్ సంఘం అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనబెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపికలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

More Telugu News