Breakup: ప్రేమలో బ్రేకప్... గుండె ఆర్యోగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే...!

  • ప్రేమలో వైఫల్యాలు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం
  • ప్రధానంగా గుండె పనితీరు మందగిస్తుందన్న నిపుణులు
  • బ్రేకప్ బాధితుల్లో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్
  • వైద్య పరిభాషలో టాకోట్సుబో అంటారని వెల్లడి
Experts says love breakup can effects heart health

స్త్రీ, పురుష ప్రేమ ప్రకృతి సహజం. అయితే అన్ని ప్రేమలు సఫలం కావు. కొందరు మాత్రమే తమ ప్రేమను పెళ్లిగా మలుచుకుంటారు. ప్రేమలో విఫలమైన వారు భగ్నప్రేమికులుగా మిగిలిపోతారు. చరిత్రలో అందుకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ప్రేమలో విఫలమైన వారికి మానసిక వేదన తప్పదని తెలిసిందే. ఇప్పుడు భగ్న ప్రేమ నేపథ్యంలో ఆరోగ్య కోణం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా మనం ఎంతో ప్రేమించే వ్యక్తి మనతో ఉంటే గుండె కొట్టుకోవడంలో తేడా కనిపిస్తుంది. అయితే అది గుండె ఆరోగ్యానికి మంచిదేనట. ప్రేమలో ఉన్నవారు ప్రశాంతంగా ఉంటారని, రక్తపోటు కూడా తక్కువగా నమోదవుతుందన్నది నిపుణుల మాట. ఇతర శరీర వ్యవస్థలు కూడా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయట. 

కానీ భగ్నప్రేమికుల్లో అందుకు పూర్తి విరుద్ధం. ప్రియురాలు లేక ప్రియుడితో బ్రేకప్ ను ఎదుర్కొంటున్న వారిలో మానసిక బాధ మాత్రమే కాదు, శారీరకంగానూ అనేక సమస్యలు ఏర్పడతాయి. సినిమాల్లో చెడువార్త వినగానే కొందరు కుప్పకూలిపోతుంటారు. ఇది నిజ జీవితంలో కూడా సంభవిస్తుందని నిపుణులు అంటున్నారు.

బ్రేకప్ కు గురైన వారిలో కొందరికి తీవ్ర గుండెపోటు కూడా రావొచ్చు. దీన్నే వైద్య పరిభాషలో టాకోట్సుబో అంటారు. అసలు, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనేది ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. దీన్ని కార్డియోమయోపతీ కేటగిరీ సమస్యగా వర్గీకరిస్తారు. 

బ్రేకప్ కారణంగా విడిపోయి తీవ్ర మనోవేదనకు గురైన వారిలో కొందరిలో గుండె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. చాలామందిలో ఈ సమస్యకు చికిత్సతో పరిష్కారం లభిస్తుంది. కొందరిలో మాత్రం మరమ్మతు చేయలేనంతగా హృదయం డ్యామేజి అవుతుంది. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనేది వాస్తవిక ఆరోగ్య సమస్య అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఇది చాలావరకు తాత్కాలిక సమస్య అని, ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్న వారిలో గుండె పరిమాణం ఒక్కసారిగా పెరగడం, రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని కార్డియాలజిస్టులు వెల్లడించారు. ఊరట కలిగించే విషయం ఏమిటంటే... ఈ లక్షణాలకు చికిత్స ఉంది. మనసులో బాధను తొలగించుకోవడం ద్వారా గుండెను తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చట. 

ఈ టాకోట్సుబో కార్డియోమయోపతీ లేక బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ స్త్రీలలో ఎక్కువని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో ఈ సిండ్రోమ్ ప్రాణాంతకం అవుతుంది. కొన్ని అంశాలు మానసిక ఒత్తిళ్లు కలిగిస్తూ, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడం ద్వారా హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. 

మానసిక ఆరోగ్యానికి, హృదయ సంబంధ ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో... వివిధ మార్గాల్లో ప్రేమను పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

పెళ్లి, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, పెంపుడు జంతువులు... ఇలా మన ప్రేమను ఎన్నో రూపాల్లో చూపించవచ్చని, తద్వారా ప్రశాంత జీవనంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా బ్రేకప్ కు బ్రేకప్ చెప్పేయొచ్చని, తద్వారా మన హార్ట్ ను పదిలంగా ఉంచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

More Telugu News