Gautam Adani: నిధుల కోసం గౌతమ్ అదానీ వేట

  • అబుదాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్ కార్ప్ తో చర్చలు
  • అదానీ ఎంటర్ ప్రైజెస్ లోకి నిధులు తెచ్చే ప్రయత్నాలు
  • ప్రాథమిక దశలోనే చర్చలు ఉన్నట్టు సమాచారం
Adani reaches out to Abu Dhabi Inc for capital infusion

హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణలతో కుదేలవుతున్న అదానీ గ్రూప్.. ఇన్వెస్టర్లలో విశ్వాస పునరుద్ధరణపై దృష్టి సారించింది. ఇప్పటికే తాము తనఖా పెట్టిన షేర్లలో కొన్నింటిని గౌతమ్ అదానీ విడిపించుకున్నారు. తాజాగా మరిన్ని నిధులు తీసుకొచ్చే కార్యక్రమంలో తలమునకలైనట్టు తెలుస్తోంది. 

గౌతమ్ అదానీతోపాటు, గ్రూప్ సీఎఫ్ వో జుగ్ షిందర్ సింగ్, ఇతర ఉన్నత స్థాయి ప్రతినిధులు అబుదాబి చేరుకుని అబుదాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్ కార్ప్ (ఐహెచ్ సీ)తో చర్చలు నిర్వహిస్తున్నట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ లోకి పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ.20వేల కోట్ల నిధుల సమీకరణ కోసం ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ చేపట్టడం తెలిసిందే. పూర్తిగా సబ్ స్క్రయిబ్ అయినప్పటికీ, షేరు ధర భారీగా పడిపోవడంతో దాన్ని రద్దు చేసుకుంది. 

హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో తాజాగా నిధులు సమీకరించడం ద్వారా ఇన్వెస్టర్లలో కంపెనీ పట్ల నమ్మకాన్ని తిరిగి కల్పించేందుకు గౌతమ్ అదానీ చర్యలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎంత మొత్తం పెట్టుబడులు రాబట్టేది ఇంకా తేలలేదని, చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపాయి. చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఇవి పెట్టుబడుల సమీకరణకు దారితీయవచ్చు లేదా సఫలం కాకపోవచ్చని పేర్కొన్నాయి. ఇటీవల రద్దు అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ పీవోలోనూ ఐఎహెచ్ సీ పాల్గొనడం గమనార్హం. ఇప్పటికే అదానీ ఎంటర్ ప్రైజెస్ లో ఈ సంస్థకు కొన్ని వాటాలు కూడా ఉన్నాయి.

More Telugu News