Turkey: టర్కీ, సిరియా భూకంపం.. విరాళాల పేరుతో మోసం

  • టిక్ టాక్ లో వీడియోలతో విరాళాలు సేకరిస్తున్న యూజర్లు
  • కొంతమంది మాత్రం మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు
  • వచ్చిన సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్లు టిక్ టాక్ ప్రతినిధి వెల్లడి 
Cheating in the name of Turkey Syria earthquake donations

భూకంపం సృష్టించిన పెను విధ్వంసానికి టర్కీ ప్రజలు అల్లాడుతున్నారు. అయినవారు దూరమై జీవచ్ఛవాలుగా మిగిలిపోయిన వారు ఎందరో.. శిథిలాల కింద ఆప్తుల కోసం వెతుక్కుంటున్నారు మరికొందరు. టర్కీతో పాటు సిరియాలోనూ భూకంపం విలయం సృష్టించింది. రెండు దేశాల్లో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 36 వేలు దాటింది. ఇంకా వేల సంఖ్యలోనే జనం శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదంతా ఒక ఎత్తు అయితే, వీరి కష్టాలను కూడా క్యాష్ చేసుకునేందుకు మరికొంతమంది ప్రయత్నస్తున్నారు. భూకంప దృశ్యాలతో వీడియోలు చేసి విరాళాలు సేకరిస్తూ సొంత జేబులు నింపుకుంటున్నారు. నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డ టర్కీ, సిరియా ప్రజలకు సాయం చేయండంటూ టిక్ టాక్ లో చాలా వీడియోలు కనిపిస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అందులో కొన్ని మోసపూరితమైనవని హెచ్చరిస్తున్నారు.

భూకంప బాధితుల పేరు చెప్పి సొంత ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకుంటున్నారని తెలిపారు. వీడియోలలోని దయనీయ దృశ్యాలను చూసి సాయం చేయడానికి ముందుకొచ్చే వారిని దోచుకుంటున్నారని వివరించారు. దీనిపై టిక్ టాక్ అధికార ప్రతినిధి ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. టర్కీ, సిరియాలో నిరాశ్రయులుగా మారిన వారిని ఆదుకోవడానికి తమ సంస్థ కృషి చేస్తోందని చెప్పారు.

పలువురు టిక్ టాక్ యూజర్లు కూడా విరాళాలు సేకరిస్తున్నారని వివరిస్తూ.. అందులో చాలామంది సదుద్దేశంతోనే చేస్తుండగా, కొంతమంది మాత్రం మోసానికి పాల్పడుతున్నారని తెలిపారు. విరాళాల ద్వారా సేకరించిన సొమ్మును సొంత ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటున్నారని, ఇది అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News