Sir Movie: చదువుకోలేక పోయినందుకు ఎంతో బాధపడుతున్నాను.. మీరా పనిచేయొద్దు: నటుడు ధనుష్

Dont Neglect Education Says Actor Dhanush To his Fans
  • ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు ‘సార్’
  • ఆడియో ఫంక్షన్‌లో స్టూడెంట్ లైఫ్‌ను గుర్తు చేసుకున్న ధనుష్
  • తన పిల్లల్ని చదివిస్తుంటే అప్పట్లో తమ చదువు కోసం తల్లిదండ్రులు పడ్డ బాధ గుర్తొస్తోందన్న ‘సార్’
తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించిన ‘వాది’ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా ‘సార్’ పేరుతో విడుదలవుతోంది. సినిమా ఆడియో విడుదల వేడుకకు హాజరైన ధనుష్ మాట్లాడుతూ.. తన స్టూడెంట్ లైఫ్‌ను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులు తనలా చేయొద్దని కోరారు. 

తన పిల్లలను చదివిస్తుంటే తమ చదువు కోసం తన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేశానని ధనుష్ గుర్తు చేసుకున్నారు. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరానని అన్నారు. టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో సిగ్గేసి కొన్ని రోజుల తర్వాత ట్యూషన్ మానేశానని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఆ అమ్మాయి కోసం బయట వేచి చూస్తుండేవాడినని, తాను వచ్చినట్టు ఆమెకు తెలిసేందుకు బైక్‌తో సౌండ్ చేసేవాడినని అన్నారు. 

ఇది చూసి టీచర్ లోపలున్న విద్యార్థులతో.. మీరంతా బాగా చదువుకుని పరీక్షలు పాసైతే ఉన్నత స్థానాల్లో ఉంటారని, బయట బైక్‌తో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని వారితో అన్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ చెప్పినట్టే తమిళనాడులో తాను డ్యాన్స్ చేయని వీధంటూ ఏమీలేదని నవ్వుతూ చెప్పారు. అయితే, ఇప్పుడు మాత్రం అప్పట్లో తానెందుకు సరిగ్గా చదువుకోలేదా? అని అనిపిస్తూ ఉంటుందని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటానని అన్నారు. తనలా తన అభిమానులు చదువును నిర్లక్ష్యం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Sir Movie
Dhanush
Vaathi
Kollywood

More Telugu News