Australia: చైనా సీసీ కెమెరాలతో జాగ్రత్త అంటున్న ఆస్ట్రేలియా

  • గతంలో చైనా సంస్థల నుంచి సీసీ కెమెరాలు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా
  • రక్షణ స్థావరాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన డేటా చైనా వెళుతున్నట్టు అనుమానం
  • సీసీ కెమెరాలు తొలగించేందుకు ఆస్ట్రేలియా నిర్ణయం
Australia concerns about China made CC Cameras

చైనా యాప్ లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఇటీవల చైనా బెలూన్లు కూడా సందేహాస్పద రీతిలో అమెరికా గగనతలంపై దర్శనమిచ్చాయి. అవి వాతావరణ పరిశోధన బెలూన్లు అని చైనా చెబుతున్నప్పటికీ, అమెరికా నమ్మడం లేదు. ఇవీ అంతర్జాతీయంగా చైనా ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోపణలు! 

ఇప్పుడీ కోవలోకే మరో అంశం వచ్చి చేరింది. చైనా సీసీ కెమెరాలతోనూ జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. గతంలో చైనా సంస్థల నుంచి కొనుగోలు చేసిన సీసీ కెమెరాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటిని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. 

అయితే, ఈ సీసీ కెమెరాలు రికార్డు చేసిన సమాచారం చైనాకు వెళుతోందని ఆస్ట్రేలియా భావిస్తోంది. రక్షణ స్థావరాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డు చేసిన సమాచారం ఇప్పుడు చైనా నిఘా సంస్థల వద్ద ఉందని ఆస్ట్రేలియా అనుమానిస్తోంది. 

చైనా ప్రభుత్వం... ఆయా సంస్థలు సేకరించిన సమాచారం పొందడానికి నాలుగేళ్ల కిందట ఓ చట్టం తీసుకువచ్చింది. చైనా ప్రజలు, సంస్థలు తమ వద్ద ఉన్న ఎలాంటి సమాచారం అయినా ప్రభుత్వంతో పంచుకోవాల్సిందే... ఇదీ ఆ చట్టం సారాంశం. 

ఈ చట్టానికి లోబడి పనిచేస్తున్నాయన్న అనుమానంతో హువావే, జీటీఈ వంటి సంస్థలపై పలు దేశాలు నిషేధం విధించడం తెలిసిందే. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆస్ట్రేలియా తమ దేశ రక్షణ శాఖ కార్యాలయాలు, కీలక స్థావరాల్లో అమర్చిన చైనా సీసీ కెమెరాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది.

More Telugu News