Punjab national bank: బ్యాంకు లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు.. గొల్లుమన్న మహిళ

  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో అనూహ్య ఘటన
  • చెదలు పట్టి కరెన్సీ నోట్లు పాడవడంతో కస్టమర్‌కు షాక్
  • బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై వినియోగదారుల ఆగ్రహం
Termites Destroy Currency Notes Worth Rs 215 Lakh In Udaipur PNB

రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు లాకర్‌లో దాచిన డబ్బుకు చెదలు పట్టడంతో ఓ కస్టమర్ దిమ్మెరపోయారు. కాలాజీ గోరాజీలోని పీఎన్‌బీ బ్రాంచ్‌లో సునిత మెహతా అనే మహిళ సుమారు రూ. రెండు లక్షలు దాచుకున్నారు. ఇటీవల ఓ రోజు ఆమె లాకర్‌లోని డబ్బును ఇంటికి తెచ్చుకున్నారు. తీరా డబ్బు ప్యాకెట్‌ను తెరిచి చూస్తే  కొన్ని కరెన్సీ నోట్లు పొడిపొడిగా అయిపోయి కనిపించాయి. చెదలు పట్టడంతో నోట్లు నాశనమయ్యాయని గుర్తించిన ఆమెకు నోటమాట రాలేదు. రూ.15 వేల విలువగల చిన్న నోట్లన్నీ పూర్తిస్థాయిలో నాశనమవగా.. రూ.500 నోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

ఈ క్రమంలో బ్యాంకుకు వెళ్లిన ఆమె సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం తన డబ్బు వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజ‌రుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో..బాధితురాలు నష్టపోయిన మొత్తాన్ని బ్యాంకు అప్పటికప్పుడు తిరిగిచ్చేసింది. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బ్యాంకు అధికారులు కూడా ఈ పరిణామంతో షాకైపోయారట. లాకర్‌లో దాచిన కరెన్సీ నోట్లలో చాలామటుకు చెదలుపట్టి నిరుపయోగంగా మారినట్టు గుర్తించి నివ్వెరపోయారు. స్థానికంగా ఈ వార్త కలకలం రేపడంతో కస్టమర్లు బ్యాంకుకు పోటెత్తారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెదల నివారణ కోసం బ్యాంకు పటిష్ఠ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

More Telugu News