Aero Indiaa show: ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా షోను ప్రారంభించిన ప్రధాని

Prime Minister Modi Inaugurates aero india show in bengaluru
  • కర్ణాటకలోని యలహంక వైమానిక క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు
  • ఏరో షో లో పాల్గొంటున్న 100 దేశాలు
  • మరిన్ని అవకాశాలకు ఎయిర్ షో రన్ వేగా నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్య

ఆసియాలోనే అతి పెద్ద వైమానిక ప్రదర్శన సోమవారం ప్రారంభమైంది. బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ‘ఏరో ఇండియా-2023’ షోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో పలు విమాన విన్యాసాలను మోదీ వీక్షించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ షో మరెన్నో అవకాశాలకు రన్ వేగా మారుతుందని వ్యాఖ్యానించారు. ‘‘నవ భారత శక్తిసామర్థ్యాల ప్రదర్శనకు బెంగళూరు గగనతలం వేదికైంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు.. మన ఆత్మవిశ్వాసానికి ఓ పరీక్ష. ఈ ప్రదర్శనలో 100 దేశాలు పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ప్రపంచానికి ఎంతటి నమ్మకం ఉందో స్పష్టమవుతోంది’’ అని మోదీ అన్నారు. 

ద రన్ వే టూ ఏ బిలియన్ ఆపర్చునిటీస్ పేరిట నిర్వహిస్తున్న ఈ ఎయిర్ షోలో రక్షణ, వైమానిక రంగానికి చెందిన 809 మంది ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, హెచ్‌సీ రోబోటిక్స్ తదితర అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టాయి. 

ఈ ఎయిర్ షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి కూడా పాల్గొన్నారు. ఆయన స్వయంగా యుద్ధ విమానాన్ని నడుపుతూ ‘గురుకుల్’ విన్యాసానికి నేతృత్వం వహించారు. ఈ షోలో భాగంగా భారతీయ విదేశీ కంపెనీల మధ్య 251 ఒప్పందాలు జరగొచ్చని అంచనా. తద్వారా భారత్‌లోకి 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News