KCR: రాజు-కవి పిట్టకథ చెప్పి అసెంబ్లీలో నవ్వులు పూయించిన సీఎం కేసీఆర్

  • కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్న కేసీఆర్
  • మోదీ రాజకీయాలపైనే శ్రద్ధ చూపుతున్నారని విమర్శలు
  • మోదీని పొగిడేవాళ్లు ఎక్కువయ్యారని వెల్లడి
CM KCR hilarious speech in Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, కేంద్రంపై ధ్వజమెత్తారు. దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. సరిగ్గా చెప్పాలంటే దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని, దేశంలోని పరిస్థితులపై సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చాక కూడా అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరుతుంటే, మోదీ మాత్రం రాజకీయాలపైనే శ్రద్ధ చూపిస్తున్నారని విమర్శించారు. ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భూటాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ ర్యాంకు ఎక్కడో దిగువన ఉందని, దీనిపై కదా పార్లమెంటులో చర్చ జరగాల్సింది అని స్పష్టం చేశారు. 

"దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరుతోందని మోదీ చెబుతున్నారు. అయితే 3.3 ట్రిలియన్లకు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ చేరుకోగలిగింది. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేది పెద్ద జోక్. హిండెన్ బర్గ్ నివేదికపై మోదీ ఎందుకు మాట్లాడరు? ఈ అంశం దేశ ప్రతిష్ఠను బాగా దెబ్బతీసింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్ ను నిశితంగా గమనిస్తున్నారు" అని వివరించారు. 

అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే మనవాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని, మోదీ పాలనలో 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేసుకున్నారని వివరించారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎందుకు వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. 

"కాంగ్రెస్ పాలన సరిగా లేదని 2014లో మోదీకి ఓటేశారు. దాంతో మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. మోదీ గెలిచారు... బీజేపీ గెలిచింది... కానీ దేశ ప్రజలు ఓడిపోయారు. ప్రధానిగా మోదీ కంటే మన్మోహన్ సింగ్ ఎక్కువ పనిచేశారు. కానీ మన్మోహన్ సింగ్ ఎలాంటి ప్రచారాలు చేసుకోలేదు" అని వెల్లడించారు. 

దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో దేశం తీవ్రంగా నష్టపోయిందని, దేశం దివాళా తీసినా మాదే పైచేయి అంటున్నారని విమర్శించారు. పార్లమెంటులో తమను తామే పొగుడుకుంటున్నారని, జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ నాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మరీ అంతగా పొగుడుకుంటే కూడా గలీజుగా, ఎబ్బెట్టుగా ఉంటుందని తెలిపారు. ఏదైనా చేస్తే దాని గురించి పొగుడుకుంటే తప్పులేదని, కానీ ఏమీ చేయనిదానికి కూడా పొగుడుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఆయన ఒక్క మాట మాట్లాడతారో లేదో... మిగిలిన సభ్యులంతా మోదీ మోదీ అంటూ మిగతావాళ్లను మాట్లాడనివ్వని పరిస్థితి తీసుకువస్తారని విమర్శించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక పిట్టకథ చెప్పారు. 

"తిరుమలరాయుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒకటే కన్ను. తనకు ఒకటే కన్ను ఉందని ఆయన చాలా బాధపడేవాడు. ఆయన ఆస్థానంలోనే ఓ కవి ఉండేవాడు. ఆయనకు కూడా తనకు గుర్తింపు లేదన్న బాధ ఉండేది. రాజు గారి నుంచి బహుమానం పొందాలంటే పొగడాలి అని ఇతరులు ఆ కవికి నూరిపోశారు. దాంతో, ఆ కవి రాజు గారి వద్దకు వెళ్లి ఓ పద్యం చెప్పాడు. 

అన్నాతి గూడి హరుడవు... అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు... అన్నా తిరుమల రాయా కన్నొక్కటి లేదు గాని కౌరవ పతివే... అంటూ ఆ కవి పలుకుతాడు. అన్నాతి అంటే భార్య. భార్యతో కలిసి ఉన్నప్పుడు ఆమె రెండు కళ్లు, నీ ఒక్క కన్ను కలిస్తే మూడు కళ్లు... అప్పుడు నీవు త్రినేత్రుడైన శివుడవు. భార్య తోడు లేకపోతే నీకు ఒక్క కన్నే ఉంటుంది కాబట్టి అప్పుడు నీవు రాక్షస గురువైన ఒంటి కన్ను శుక్రాచార్యుడి అంతటి వాడవు. ఇక ఉన్న ఒక్క కన్ను కూడా లేకపోతే రెండు కళ్లు లేని ధృతరాష్ట్రుడి అంతటివాడివి అంటూ ఆ కవి రాజును పొగిడే ప్రయత్నం చేస్తాడు" అంటూ కేసీఆర్ సభలో నవ్వులు పూయించారు. 

ఇప్పుడు పార్లమెంటులో మోదీని బీజేపీ నేతలు ఇలాగే పొగుడుతున్నారని అన్నారు. ఈ మోదీకి చెప్పేవాళ్లు కూడా, ఇంకా మంచిగా చేయాలని చెప్పకుండా, బాగుంది బాగా చేస్తున్నారు అంటూ ఆయన ఓడిపోయి మాజీ ప్రధాని అయ్యేదాకా చెబుతూనే ఉంటారు అని వివరించారు.

More Telugu News