Nara Lokesh: లోకేశ్ కు ప్రాణహాని కలిగించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు... గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • పాదయాత్రపై డ్రోన్ల సంచారం
  • లోకేశ్ భద్రతపై టీడీపీ నేతల ఆందోళన
  • రాజ్ భవన్ లో గవర్నర్ తో టీడీపీ నేతల భేటీ
TDP leaders complains to Governor

టీడీపీ నేతలు ఇవాళ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేశ్ కు ప్రాణహాని తలపెట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. నిఘా ముసుగులో పోలీసులు డ్రోన్ల సాయంతో లోకేశ్ లేని చోట చిత్రీకరిస్తున్న దృశ్యాలను కూడా టీడీపీ నేతలు గవర్నర్ కు అందజేశారు. 

లోకేశ్ పాదయాత్రకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలతో మాట్లాడకుండా మైక్ లు లాగేసుకుంటున్నారని, కేసులు నమోదు చేస్తున్నారని, వాహనాలు సీజ్ చేస్తున్నారని గవర్నర్ కు వివరించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బొండా ఉమ, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర తదితరులు ఉన్నారు. 

గవర్నర్ తో భేటీ అనంతరం నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. లోకేశ్ పాదయాత్రను ఏదో ఒక విధంగా అడ్డుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారి రఘురామరెడ్డి, పోలీసు అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి ప్రతి రోజు కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేశ్ భద్రత పట్ల ఆందోళన చెందుతున్నామని వెల్లడించారు. 

"ఓవైపు లోకేశ్ పాదయాత్రపై డ్రోన్లు తిరుగుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూడండి. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని నడిపిస్తున్నాడు" అని నక్కా ఆనంద్ బాబు వివరించారు. 

బొండా ఉమ మాట్లాడుతూ, తాడేపల్లి ఆదేశాల మేరకు డీఐజీ రఘురామరెడ్డి వెనుక ఓ కార్లో ఉంటూ నిర్విరామంగా ఆదేశాలు ఇస్తూ లోకేశ్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

కొల్లు రవీంద్ర స్పందిస్తూ... వై నాట్ 175 కాదు జగన్ మోహన్ రెడ్డీ... వై నాట్ తాడేపల్లి ప్యాలెస్ గానే మిగిలిపోతావు అని హెచ్చరించారు. ఇటువంటి ముఖ్యమంత్రికి తొత్తులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి వారే నిదర్శనం అని, రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఈ విషయం గమనించాలని అన్నారు.

More Telugu News