Mahmood Madani: మోదీ, మోహన్ భగవత్ లకే కాదు... భారతదేశం నాకు కూడా చెందుతుంది: జమియత్ ఉలేమా చీఫ్

  • ఢిల్లీలో జమియత్ ఉలేమా ప్లీనరీ సమావేశాలు
  • భారత్ మా దేశం అని నినదించిన మహమూద్ మదానీ
  • భారత్ లో అత్యంత ప్రాచీన మతం ముస్లిం మతమేనని వెల్లడి
  • ఇస్లాం బయటి నుంచి వచ్చిన మతం కాదని స్పష్టీకరణ 
Mahmood Madani comments about Islam religion

ముస్లిం ధార్మిక సంస్థ జమియత్ ఉలేమా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లకు మాత్రమే కాకుండా, భారతదేశం తనకు కూడా చెందుతుందని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరుగుతున్న జమియత్ ఉలేమా ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

"భారత్ మా దేశం. ఈ దేశం మోదీ, భగవత్ లకు ఎంత సొంతమో, మహమూద్ మదానీకి కూడా అంతే సొంతం. వారు మదానీ కంటే ఒక అంగుళం ఎక్కువ కాదు, అలాగని మదాని కూడా వారి కంటే ఒక అంగుళం ఎక్కువ కాదు... అందరూ సమానమే" అని మదాని స్పష్టం చేశారు. 

అంతేకాదు, భారత్ లో అత్యంత ప్రాచీన మతం ఇస్లాం మతమేనని అన్నారు. ముస్లింల తొలి మాతృభూమి ఇదేనని పేర్కొన్నారు. ఇస్లాం భారత్ కు చెందిన మతం కాదని, బయటి నుంచి వచ్చిన మతం అనే వాదనలు పూర్తిగా నిరాధారమని మహమూద్ మదాని కొట్టిపారేశారు. అన్ని మతాల కంటే ముందు ఏర్పడినది ఇస్లాం మతం అని, హిందీ ముస్లింలకు భారత్ అత్యంత అనువైన దేశం అని ఉద్ఘాటించారు. 

బలవంతపు మత మార్పిళ్లకు తాము కూడా వ్యతిరేకమని, ప్రలోభాలకు గురిచేసి, స్వార్థ ప్రయోజనాలతో పాల్పడే మత మార్పిళ్లను తాము అంగీకరించబోమని మదాని స్పష్టం చేశారు. అయితే, కొన్ని సార్లు స్వచ్ఛందంగా మతం మార్చుకున్నవారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కొన్ని కేంద్ర సంస్థలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న దృష్టాంతాలు కనిపిస్తున్నాయని, నమాజులపై నిషేధం, ముస్లింలపై పోలీసు చర్యలు, బుల్డోజర్లను రంగంలోకి దింపడం వంటి చర్యలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు.

More Telugu News