Bandi Sanjay: మేం అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ డోమ్ లను తొలగిస్తాం: బండి సంజయ్

  • మన సంప్రదాయాల ప్రకారం మార్పులు చేస్తామన్న సంజయ్  
  • మజ్లిస్ నేత ఒవైసీ మెప్పుకోసమే డోమ్ లతో డిజైన్ చేశారని ఆరోపణ 
  •  బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని వ్యాఖ్య 
Telangana BJP Chief Bandi Sanjay Sensational Comments On Telangana New Secreteriat

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మెప్పు పొందేందుకే సీఎం కేసీఆర్ సచివాలయాన్ని మసీదు ఆకారంలో కట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం పైన అమర్చిన డోమ్ లను తొలగిస్తామని తేల్చిచెప్పారు.

అదేవిధంగా సచివాలయంలో భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయిస్తామని సంజయ్ చెప్పారు. పార్టీ ప్రచార కార్యక్రమం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా శుక్రవారం బండి సంజయ్ బోయిన్ పల్లిలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో రోడ్లకు అడ్డంగా కట్టిన మతపరమైన నిర్మాణాలు.. గుడులు, మసీదులు, చర్చిలను కూల్చేస్తామని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, ఆ కూల్చివేత పనులను పాత బస్తీ (ఓల్డ్ సిటీ) నుంచి మొదలు పెట్టాలని బండి సంజయ్ సవాల్ చేశారు.

బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని సంజయ్ ఆరోపించారు. కొత్త సచివాలయం చాలా బాగుందని, దానిని చూస్తుంటే తాజ్ మహల్ ను చూసినట్లుందని అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు గుప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒవైసీ కళ్లలో ఆనందం చూడడానికే తాజ్ మహల్ నమూనాలో సచివాలయం డిజైన్ ను ఎంపిక చేశారని సీఎం కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరని, ప్రశ్నించిన వాళ్లను జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

More Telugu News