cm kcr: ఈ నెలలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్

  • మొత్తం 11.5 లక్షల ఎకరాలకు పట్టాలు అందజేస్తామన్న సీఎం
  • గిరిజనుల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉన్నట్లు వెల్లడి
  • ఇకపై అడవుల నరికివేత జరగకూడదని హెచ్చరిక
  • అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం
kcr speech in assembly about podu bhoomulu issue

పోడు భూముల పంపిణీ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శుక్రవారం సీఎం కేసీఆర్ సభలో మాట్లాడారు. పోడు భూముల పంపిణీ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు అఖిలపక్ష నేతల నుంచి అడవుల నరికివేతపై తగిన హామీ వచ్చే దాకా పోడు భూముల పంపిణీ చేపట్టబోమని తేల్చిచెప్పారు.

అదేసమయంలో గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం చిత్తశుద్ధితో తాము పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రంలో అడవుల నరికివేత జరగనివ్వబోమని, ఇప్పటికే సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఫిబ్రవరి నెలాఖరులో పోడు భూముల పట్టాలు అందజేస్తామని కేసీఆర్ వివరించారు.

సభలోని అన్ని పార్టీల నేతలతో కలిసి పోడు భూముల పంపిణీతో పాటు గిరిజనులకు రైతుబంధు, విద్యుత్ సదుపాయం కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ పట్టాల పంపిణీ తర్వాత కూడా భూమిలేని, భుక్తిలేని, ఎటువంటి ఆధారంలేని గిరిజన బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని వివరించారు. అలాంటి వారి కోసం దళితబంధు తరహాలో గిరిజన బంధు పథకం అమలుచేస్తామని వివరించారు.

ఈ పక్రియ మొత్తం ముగిశాక రాష్ట్రంలో పోడు భూములనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదని సీఎం కేసీఆర్ చెప్పారు. వాస్తవానికి పోడు భూములకు పట్టాలివ్వడమనేది న్యాయబద్ధమైన డిమాండ్ కానేకాదని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లోని చెట్లను నరికేసి, భూమిని దున్నుకుంటూ పట్టాలు ఇవ్వాలని అడిగితే ఎలా ఇస్తారంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

రాత్రికిరాత్రి పక్క రాష్ట్రాల నుంచి గుత్తికోయలను తీసుకొచ్చి, చెట్లను నరికించి అటవీ భూములను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్రంలో అడవులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సిబ్బందిని అదిలించి, బెదిరించి, ప్రత్యేకంగా చట్టాన్ని చేసి రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వ కృషి వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.8 శాతానికి పెరిగిందని సీఎం చెప్పారు.

More Telugu News