Chiranjeevi: నువ్వు అతడికంటే అందగాడివా? అంటూ అప్పట్లో నన్ను చులకన చేశారు: మెగాస్టార్ చిరంజీవి

  • గాయని స్మిత 'నిజం' షోలో పాల్గొన్న మెగాస్టార్
  • కెరీర్‌ తొలినాటి అనుభవాల్ని చెప్పిన చిరు
  • అప్పట్లో తనను హేళన చేశారని వెల్లడి
megastar chiranjeevi talks about his early days in Telugu film industry during smitha talk show nijam

గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆ తరువాత తన పట్టుదల, స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగారు. తెలుగు సినీరంగంలో మేరుశిఖర సమానమైన గౌరవాభిమానాలు దక్కించుకున్నారు. తాజాగా ఆయన.. ప్రముఖ గాయని స్మిత వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘నిజం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీరంగంలో కాలుపెట్టిన తొలినాళ్ల అనుభవాల్ని పంచుకున్నారు. 

సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తనకు అవమానాలు ఎదురయ్యాయని మెగాస్టార్ తెలిపారు. ‘‘నటుడిగా ఈ స్థాయికి ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభకు గురయినా ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేదు. నన్ను నేను సమాధాన పరుచుకుని మళ్లీ కార్యరంగంలోకి దూకేవాడిని. 

ఇండస్ట్రీలోకి రావాలనే ఆశతో మద్రాస్‌కు వచ్చిన కొత్తలో పాండీబజార్‌కు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి.. ‘ఏంటి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చావా..? సినిమాల్లో ట్రై చేద్దామనా..? అతడిని చూడు ఎంత అందంగా ఉన్నాడో..అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే పరిశ్రమలో ప్రవేశించడం కష్టమే..! కాబట్టి నీ కలను మర్చిపో..’ అంటూ హేళనగా మాట్లాడాడు. 

ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడి ముందు కూర్చుని.. ఇలాంటి వాటికి బెదరకూడదని నిర్ణయించుకున్నా. ఆ తరువాత పాండీ బజార్‌వైపు ఏడాది పాటు వెళ్లలేదు. ఇప్పుడు ఎవరైనా నన్ను విమర్శిస్తే పెద్దగా పట్టించుకోను. చూసి నవ్వుకుంటాను. గుర్తింపు కోసమే అలాంటి మాటలు మాట్లాడుతున్నారని అనుకుంటా’’ అంటూ తన కెరీర్ తొలినాళ్లలోని అనుభవాలను పంచుకున్నారు మెగాస్టార్.

More Telugu News