ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారు?: చంద్రబాబు

  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • కేసులు పెడుతున్న పోలీసులు
  • అందరినీ బెదిరించి చంపేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • జగన్ ఓడిపోతారని అన్ని సర్వేలు చెబుతున్నాయని వ్యాఖ్య 
  • ఫోన్ ట్యాపింగ్ వాస్తవమేనన్న టీడీపీ అధినేత   
Chandrababu reacts to police being filed cases against Nara Lokesh

చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసులు కేసులు పెడుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని నిలదీశారు. బయటికి రాకుండా అందరినీ బెదిరించి చంపేస్తారా? అంటూ మండిపడ్డారు. 

జగన్ ఓడిపోతారని అన్ని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవడం ఖాయమని వ్యాఖ్యానించారు. 

ఫోన్ ట్యాపింగ్ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్లు ట్యాప్ చేసి నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. నివేదికలతో సీఐడీ అధికారి రఘురామిరెడ్డి కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్నది వాస్తవం అని, తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆఖరికి జడ్జిల ఫోన్లు సైతం ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులను వదిలేది లేదని హెచ్చరించారు.

More Telugu News