Team India: నాగపూర్ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట... టీమిండియాదే పైచేయి

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • తొలి ఇన్నింగ్స్ లో 177కి ఆలౌట్
  • జడేజాకు 5 వికెట్లు
  • ఆట చివరికి 1 వికెట్ నష్టానికి 77 పరుగులు చేసిన భారత్
  • క్రీజులో రోహిత్ శర్మ (56), అశ్విన్
Team India trying to tighten the grip in Nagpur test

నాగపూర్ లో ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. మొదటి రోజు ఆటలో ఆద్యంతం భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. తొలుత ఆసీస్ ను 177 పరుగులకే కుప్పకూల్చిన ఆతిథ్య జట్టు... ఆపై ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులతోనూ, నైట్ వాచ్ మన్ రవిచంద్రన్ అశ్విన్ పరుగులేమీ లేకుండానూ క్రీజులో ఉన్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కొత్త స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ 100 పరుగులు వెనుకబడి ఉంది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో రోహిత్ ధాటిగా ఆడాడు. 9 ఫోర్లు, 1 సిక్స్ తో దూకుడు కనబర్చాడు. మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో 71 బంతులాడి 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాహుల్ స్కోరులో ఒక బౌండరీ మాత్రమే ఉందంటే అతడి బ్యాటింగ్ ఎంత నిదానంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

ఆసీస్ బౌలింగ్ దళంలో ప్రధాన బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆరంభంలోనే వికెట్లు తీయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. కెప్టెన్ పాట్ కమిన్స్ కొత్త బంతితో బౌలింగ్ చేసినప్పటికీ, ఏమంతగా ప్రభావం చూపలేకపోయాడు. 

ఇక, రేపటి ఆటలో ఉదయం పిచ్ పై తేమను సద్వినియోగం చేసుకుని వికెట్లు తీస్తేనే ఆసీస్ పరిస్థితి మెరుగవుతుంది. అయితే, సొంతగడ్డపై ఆడుతున్న టీమిండియాను ఇలాంటి పరిస్థితుల్లో నిలువరించడం ఆసీస్ కు ఏమంత సులువు కాదు.

More Telugu News