Raghu Rama Krishna Raju: జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టే.. చంద్రబాబుకు ధన్యవాదాలు: రఘురామకృష్ణరాజు

Center has sprinkled water on Jagan hopes says Raghu Rama Krishna Raju
  • రాజధాని అమరావతేనని కేంద్రం చెప్పిందన్న రఘురాజు
  • కావాలనుకుంటే జగన్ విశాఖకు వెళ్లొచ్చని వ్యాఖ్య
  • సునీల్ కుమార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతేనని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చిందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. విశాఖ రాజధాని అంటున్న సీఎం జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టేనని చెప్పారు. కావాలనుకుంటే జగన్ విశాఖకు వెళ్లొచ్చని... అవసరం లేని వారు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనని అన్నారు. రాజధాని అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. ఈ ప్రశ్న అడిగిన విజయసాయిరెడ్డికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటయిందని... ఇప్పుడు విశాఖను రాజధానిగా మార్చాలంటే పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని చెప్పారు. 

సీఐడీ పోలీసులు జగన్ డైరెక్షన్ లో తనను దారుణంగా హింసించిన అంశంలో రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందని రఘురాజు అన్నారు. తనను హింసించిన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. తన ప్రాణాలకు ప్రతిపక్ష నేతలు అండగా ఉన్నారని... ముఖ్యంగా తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారని, అక్కడ గోల్ఫ్ ఆడుకుంటున్నారని చెప్పారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News