కాకినాడ జిల్లా ఆయిల్ ఫ్యాక్టరీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

  • జి.రాగంపేటలో విషాద ఘటన
  • ఆయిల్ ట్యాంకరులో దిగి మృతి చెందిన ఏడుగురు కార్మికులు
  • ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన వైనం
  • పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న పవన్
Pawan Kalyan responds to oil factory tragedy in Kakinada district

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్స్ పరిశ్రమలో ఓ ఆయిల్ ట్యాంకును శుభ్రపరిచేందుకు అందులో దిగిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వడంతో పాటు, తగిన ఉపాధి అవకాశాలు చూపించేలా ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. 

రాష్ట్రంలోని పరిశ్రమల్లో తరచుగా ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నా గానీ ప్రభుత్వం తగిన సమీక్షలు చేపట్టడంలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల గురించి సంబంధిత శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవని పేర్కొన్నారు. దాంతో, రెక్కల కష్టం మీద బతికే కార్మికులు మృత్యువాత పడుతున్నారని పవన్ వివరించారు. వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్ అగమ్యగోచరం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News