అదానీని హగ్ చేసుకుని, మిగిలిన ఆవులను మనకు వదిలారు..: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

  • వేలంటైన్స్ డే నాడు ఆవులను హగ్ చేసుకోవాలన్న పిలుపుపై రౌత్ స్పందన
  • గోవులను ప్రేమించడానికి ప్రత్యేకంగా ఓ రోజు అవసరం లేదని వ్యాఖ్య
  • గౌతమ్ అదానీకి మద్దతు తెలిపిన మాజీ ఐఏఎస్ షా ఫైసల్
Adani is holy cow for BJP says Sanjay Raut on cow hug day notice

గౌతమ్ అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ భిన్నంగా స్పందించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డేని ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ పిలుపునిచ్చింది. ఈ రెండు అంశాలకు ముడిపెడుతూ రౌత్ వ్యంగ్యంగా మాట్లాడారు. 

‘‘బీజేపీకి అదానీ పవిత్ర గోవు. అందుకే వారు పవిత్రమైన ఆవును హగ్ చేసుకుని, మిగిలిన ఆవులను వేలంటైన్స్ డే రోజు మనం హగ్ చేసుకునేందుకు వదిలిపెట్టారు’’ అంటూ సంజయ్ రౌత్ చమత్కరించారు. అయినప్పటికీ మనం గోమాతను గౌరవిస్తామంటూ, వాటి పట్ల మన ప్రేమను చూపించేందుకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరం లేదని రౌత్ అన్నారు. 


మరోవైపు జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన షా ఫైసల్ కూడా అదానీ అంశంపై స్పందించారు. ‘‘గౌతమ్ అదానీని గౌరవిస్తాను. ఆయన ఎంతో మనవతావాది. సమాజంలో వైవిధ్యాన్ని ఎంతో గౌరవిస్తారు. భారత్ ను ఎంతో ఉన్నత స్థానంలో చూడాలని కోరుకునే వ్యక్తి. ఈ సమయంలో ఆయనకు, ఆయన కుటుంబానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’’ అని షా ఫైసల్ ట్వీట్ చేశారు.

More Telugu News