'శ్రీదేవి - శోభన్ బాబు'లో అనకాపల్లి స్లాంగ్ హైలైట్: హీరో సంతోష్ శోభన్

  • సంతోష్ హీరోగా 'శ్రీదేవి శోభన్ బాబు' 
  • కథానాయికగా గౌరీ కిషన్ పరిచయం 
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల
Sridevi Sobhan Babu Team Interview

1980లలో శ్రీదేవి - శోభన్ బాబు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ కాలంలో అమ్మాయిలు కాస్త ముస్తాబయితే శ్రీదేవితోను .. అబ్బాయిలు ఎవరైనా స్టయిల్ గా తయారైతే శోభన్ బాబుతోను పోల్చేవారు. ఒకరకంగా చెప్పాలంటే ఆటపట్టించేవారు. ఈ పరిస్థితి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేది. 

అలాంటి ఒక లైన్ తీసుకుని అల్లుకున్న కథనే 'శ్రీదేవి - శోభన్ బాబు'. గౌరీ కిషన్ - సంతోష్ శోభన్ జంటగా నటించిన ఈ సినిమాను సుస్మిత కొణిదెల నిర్మించగా, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. 

తాజా ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ .. "ఈ కథ అంతా కూడా 'అనకాపల్లి' పరిసర ప్రాంతాల్లో నడుస్తుంది. నా పాత్ర అనకాపల్లి స్లాంగ్ మాట్లాడుతుంది. శ్రీదేవి - శోభన్ బాబు సినిమాలు వచ్చే కాలంలో గ్రామీణ పరిస్థితులు ఎలా ఉండేవనే దానికి ఈ సినిమా అద్దం పడుతుంది" అన్నాడు. 

"నిజం చెప్పాలంటే, నేను పెరిగింది సిటీలోనే.. అందువలన విలేజ్ నేపథ్యం నాకు కూడా అలవాటు లేదు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు చూస్తే మాత్రం నాకే చాలా కొత్తగా అనిపించింది. జాతర సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. సరదాగా .. సందడిగా సాగిపోయే ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News