adani group: అదానీ గ్రూప్ పై ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ పిటిషన్లు.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

SC to hear plea seeking probe into Hindenburg report adani group
  • హిండెన్ బర్గ్ నివేదికపై రెండు ప్రజాహిత వ్యాజ్యాల దాఖలు
  • శుక్రవారం విచారణ చేపడతామన్న అత్యున్నత న్యాయస్థానం
  • నష్టపోతున్న అదానీ గ్రూపు కంపెనీల షేర్లు
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ నిర్వహించనుంది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలన్నది పిటిషనర్ల అభ్యర్థన. అదానీ అంశంపై రెండు ప్రజాహిత వ్యాజ్యాలు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. న్యాయవాది ఎంఎల్ శర్మ, విషాల్ తివారీ దాఖలు చేశారు.

హిండెన్ బర్గ్ నివేదిక ఇన్వెస్టర్లను ఎంతో నష్టానికి గురి చేసినట్టు పిటిషనర్లు ఆరోపించారు. దేశ ప్రతిష్టను హిండెన్ బర్గ్ నివేదిక దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుందని తివారీ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మీడియా అత్యుత్సాహం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్టు ఎంఎల్ శర్మ తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు. తన ఆరోపణలకు ఆధారాలను చూపించడంలో హిండెన్ బర్గ్ సంస్థ అధినేత నాథర్ అండర్సన్ విఫలమైనట్టు వివరించారు. 

అదానీ గ్రూప్ తన షేర్ల ధరలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్టు హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపించడం తెలిసిందే. వీటిని అదానీ గ్రూపు ఖండించింది. సెబీ సైతం హిండెన్ బర్గ్ అంశాలపై దృష్టిపెట్టినట్టు సమాచారం. దీనిపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా, అదానీకి మోదీ సహకారం ఉందని ఆరోపించాయి. దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం కోసం పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జీఎస్టీ, పన్ను అధికారులు అదానీ విల్ మార్ కంపెనీకి చెందిన గోదాములపై దాడులు నిర్వహించారు. పన్నుల ఎగవేత ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. ఎంఎస్ సీఐ ఇండెక్స్ లో అదానీ గ్రూపు వెయిటేజీపై సమీక్ష నిర్వహించనున్నట్టు వచ్చిన ప్రకటనతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు గురువారం నష్టాలను చూస్తున్నాయి.
adani group
Supreme Court
hear
PILs

More Telugu News