Indian Missing: టర్కీలో భారతీయుడి గల్లంతు

  • బిజినెస్ ట్రిప్ కోసం వెళ్లిన బెంగళూరు వాసి
  • భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మరో పదిమంది 
  • క్షేమంగానే ఉన్నారని ప్రకటించిన భారత విదేశాంగ శాఖ
  • టర్కీ, సిరియాలలో 15 వేల మందికి పైగా మృతి
Indian Missing After Turkey Quake

వరుస భూకంపాలతో టర్కీ (తుర్కియే), సిరియాలలో వేల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ సంఖ్య 15 వేలు దాటిందని టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధ్వంసం నేపథ్యంలో టర్కీలోని భారతీయుల క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్లో ఒకరి ఆచూకీ దొరకడంలేదని, మరో పది మంది గ్రామీణ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు.

బిజినెస్ ట్రిప్ లో భాగంగా ఇటీవలే టర్కీ వెళ్లిన బెంగళూరు వాసి ఆచూకీ తెలియడంలేదని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. సదరు బిజినెస్ మెన్ గురించి గాలిస్తున్నట్లు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పదిమంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని, వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

భారత విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. టర్కీలో మన దేశస్థులు 3 వేల మందికి పైగా ఉంటున్నారు. భూకంపం నేపథ్యంలో వీరి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి టర్కీలోని అదానా సిటీలో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

దీంతో పాటు భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోవడానికి టర్కీ, సిరియాలకు రిలీఫ్ మెటీరియల్ ను పంపిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో టర్కీకి రెస్క్యూ సిబ్బందిని కూడా పంపించినట్లు కేంద్ర మంత్రి జైశంకర్ వివరించారు.

More Telugu News