Nara Lokesh: నువ్వు బయటకు ఎలా వస్తావో నేనూ చూస్తా: జగన్ కు లోకేశ్ సవాల్.. ఈనాటి పాదయాత్ర హైలైట్స్

  • 13వ రోజును పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర
  • స్టూల్ పై నిలబడి ప్రసంగించిన లోకేశ్
  • ప్రభుత్వ సలహాదారుల్లో 71 శాతం మంది జగన్ సామాజికవర్గానికి చెందినవారేనని మండిపాటు
Nara Lokesh padayatra high lights


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజామద్దతులో ఉత్సాహంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన ఆయన యాత్ర 13వ రోజును పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర 155.5 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈరోజు ఆయన 9.6 కిలోమీటర్లు నడిచారు. ఈరోజు ఆయన పాదయాత్ర చిత్తూరు రూరల్ దిగువమాసనపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమయింది. పాదయాత్రకు ముందు ఆయన బీసీ యువ నేతలతో సమావేశమయ్యారు.  

చిత్తూరు రూరల్ మండలం ఎన్ఆర్ పేట ఎన్టీఆర్ సర్కిల్ లో లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు పోలీసులు నిరాకరించారు. దాదాపు వంద మంది పోలీసులు మోహరించారు. సభ నిర్వహించడానికి వీల్లేదని డీఎస్పీ చెప్పగా... రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ఆయనపై లోకేశ్ మండిపడ్డారు. సభ పెట్టడానికి వీల్లేదని పోలీసులు చెప్పడంతో... ఆ సర్కిల్ లో స్టూల్ పై నిలబడి మైక్ తో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కు భయం అంటే ఏమిటో చూపిస్తానని లోకేశ్ అన్నారు. సభలు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకపోతే... తాడేపల్లి ప్యాలస్ లో సభలు పెట్టుకోవాలా అని మండిపడ్డారు. నువ్వు బయటకు ఎలా వస్తావో నేనూ చూస్తానని జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఒక జీతగాడిలా నీ హద్దుల్లో ఉండు అంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జలను హెచ్చరించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. బీసీలకు పనిముట్లు ఇచ్చే ఆదరణ పథకాన్ని మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. యాదవ సోదరులు అడిగిన విధంగా గొర్రెల పంపిణీ చేయడమే కాక... వాటికి బీమా కూడా చేయిస్తామని అన్నారు. 

ప్రభుత్వ సలహాదారుల్లో 71 శాతం మంది జగన్ సామాజికవర్గానికి చెందినవారేనని లోకేశ్ మండిపడ్డారు. సలహాదారులు, యూనివర్శిటీల వైస్ ఛాన్సెలర్లుగా బీసీలు పనికిరారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆర్థిక శాఖ, టీటీడీ , ఏపీఐఐసీ ఛైర్మన్ పదవులను బీసీలకు ఇచ్చామని చెప్పారు. 16 యూనివర్శిటీల్లో 9 మందికి వీసీలుగా అవకాశం ఇచ్చామని తెలిపారు. 

వాల్మీకి, రజకులను ఎస్టీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే ఉంటారని... బీసీలకు అక్కడ ప్రవేశం ఉండదని అన్నారు. సలహాదారులకు రూ. 3 లక్షల జీతం, కేబినెట్ హోదా ఇస్తున్నారని... కానీ 56 కుల కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆ అవకాశం లేదని విమర్శించారు. 

చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఆ తర్వాత వచ్చిన సీఎంలు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కొనసాగించారని... జగన్ మాత్రం అభివృద్ధిని చంపేశారని మండిపడ్డారు. డ్రగ్స్ లో ఏపీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నాయని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మలుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జనం మధ్యలోకి రాలేని జగన్ అంతకు ముందు పాదయాత్ర ఎలా చేశారని ప్రశ్నించారు. అది డూప్ పాదయాత్రేనా? అని ఎద్దేవా చేశారు.

More Telugu News