Revanth Reddy: కోవర్ట్ ఆపరేషన్లలో ఎర్రబెల్లి ఎక్స్ పర్ట్: రేవంత్ రెడ్డి

  • 2024 జనవరి మొదటి వారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న రేవంత్
  • తొలి సంతకం పోడు భూముల సమస్య పరిష్కారం పైనేనని వెల్లడి  
  • మంత్రుల్లో 90 శాతం మంది తెలంగాణ వ్యతిరేకులేనని మండిపాటు
Errabelli is expert in Covert operations says Revanth Reddy

కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2024 జనవరి మొదటి వారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం పోడు భూముల సమస్య పరిష్కారం పైనే ఉంటుందని చెప్పారు. భూతంలాంటి కేసీఆర్ ను పట్టి సీసాలో బంధించాలని అన్నారు. లేకపోతే కేసీఆర్ ను తట్టుకోలేమని... కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ప్రవేశంలేనప్పుడు ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికే ప్రగతి భవన్ లోకి అనుమతి ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు ప్రగతి భవన్ లో పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నారని దుయ్యబట్టారు.

కోవర్ట్ ఆపరేషన్లలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్స్ పర్ట్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు, 60 వేల బెల్టు షాపులు ఉన్నాయని... ప్రజలను తాగుబోతులుగా చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోవడంతో... రైతులు అప్పులపాలయ్యారని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, దయాకర్ రావు వంటి తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ మంత్రి పదవులను ఇచ్చారని... మంత్రుల్లో 90 శాతం మంది తెలంగాణ వ్యతిరేకులేనని విమర్శించారు. మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంచి వ్యక్తి అని... ఆయన కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు.

More Telugu News