Supreme Court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

supreme court on mlas poaching case
  • దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు
  • సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • స్టే లేదా స్టేటస్ కో ఇచ్చేందుకు సమ్మతించని సీజేఐ ధర్మాసనం
  • ఈనెల 17న విచారణ జరుపుతామని వెల్లడి 
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనంలో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ రోజు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లుత్రా తమ పిటిషన్ ను ప్రస్తావించారు. అయితే స్టే కానీ, స్టేటస్ కో (యథాతథ స్థితి) కానీ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ నెల 17న విచారణ జరిపుతామని స్పష్టం చేసింది.

కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని, లేదా స్టేటస్ కో ఇవ్వాలని విచారణ సందర్భంగా న్యాయవాది సిద్ధార్థ లుత్రా కోరారు. కేసు ఫైలు సిట్ నుంచి సీబీఐ చేతికి వెళ్తే మొత్తం నీరుగారిపోతుందని, ఫైల్స్ ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ నుంచి ఒత్తిడి ఉందని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. 

అయితే న్యాయవాది విన్నపాన్ని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. ఈ నెల 17న విచారణ జరుపుతామని, ఆ సమయంలోనే అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. కేసులో ఏమైనా మెరిట్స్ ఉంటే డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 13న విచారించాలని సిద్ధార్థ లుత్రా కోరాగా.. అందుకు ధర్మాసనం సమ్మతించలేదు.
Supreme Court
mlas poaching case
BRS
Telangana government
High Court

More Telugu News