Indian: కాలినడకన హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

Indian Man Walking To Saudi Arabia To Perform Haj Enters Pakistan
  • మక్కా దర్శనం కోసం కేరళ నుంచి  పాదయాత్ర ప్రారంభించిన 29 ఏళ్ల షిహాబ్
  • 3 వేల కి.మీ. నడిచిన తర్వాత వీసా లేదని వాఘా వద్ద  అడ్డుకున్న పాక్ అధికారులు
  • పాక్ సుప్రీంకోర్టు జోక్యంతో అతనికి వీసా మంజూరు 
పవిత్ర మక్కా దర్శనానికి కాలినడకన హజ్ యాత్ర చేస్తున్న షిహాబ్ చొత్తుర్ అనే భారతీయుడు సౌదీ అరేబియా మార్గంలో పాకిస్థాన్ లోకి ప్రవేశించాడు. ఈ యాత్ర కోసం అతను పాకిస్థాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తొలుత తిరస్కరించిన పాక్ అధికారులు.. అక్కడి సుప్రీంకోర్టు జోక్యంతో వీసా మంజూరు చేశారు.

తన యాత్రను పూర్తి చేయాలనే సంకల్పంతో 29 ఏళ్ల షిహాబ్ మంగళవారం వాఘా సరిహద్దు గుండా పాక్ చేరుకున్నాడు. షిహాబ్ తరపున పాక్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సర్వర్ తాజ్ భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ పాకిస్థాన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ అతనికి స్వాగతం పలికారు. మక్కాకు తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీసా లభించినందుకు షిహాబ్ చాలా సంతోషంగా ఉన్నారని ఖురేషీ తెలిపారు. 

కేరళకు చెందిన షిహాబ్ గత ఏడాది అక్టోబర్‌లో తన స్వరాష్ట్రం నుంచి వాఘా సరిహద్దు వరకు కాలినడకన 3,000 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించాడు.  వీసా లేనందున అక్కడ పాకిస్థాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని అడ్డుకున్నారు. తాను కాలినడకన హజ్ యాత్ర చేస్తున్నానని వారికి చెప్పాడు. ఇప్పటికే 3,000 కిలోమీటర్లు ప్రయాణించానని, మానవతా దృక్పథంతో దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని షిహాబ్ ఇమ్మిగ్రేషన్ అధికారులను వేడుకున్నాడు. ఇరాన్ మీదుగా సౌదీ అరేబియా చేరుకోవడానికి రవాణా వీసా కావాలని కోరాడు. అతని తరఫున కొందరు కోర్టును ఆశ్రయించడంతో వీసా మంజూరైంది. పాక్ చేరుకున్న అతనికి అక్కడి ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. యువకులు అతనిపై పూలు చల్లుతూ, సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Indian
Haj
Pakistan

More Telugu News