Tamil Nadu: సెలవుల కోసం వంక వెతికే ఈ రోజుల్లో.. 12 ఏళ్లుగా సెలవే ఎరుగని ఉపాధ్యాయుడు!

  • తమిళనాడు, అరియలూరు జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘనత
  • ఆదర్శంగా నిలుస్తున్న కలైయరసన్ 
  • అత్యవసర పనులను సెలవు రోజుల్లో పూర్తి చేసుకుంటున్న మాస్టారు
Govt school teacher who hasnt taken leave for 12 years In Tamil Nadu

నిత్య జీవితంలో ఎన్నో పనులుంటాయి. వీటిని నెరవేర్చుకునేందుకు వేతన జీవులు అప్పుడప్పుడు సెలవులు పెట్టడం తప్పనసరి. చీటికిమాటికి సెలవులు తీసుకునేవారు కొందరుంటే, సెలవుల కోసం కుంటిసాకులు చెప్పేవారు మరికొందరుంటారు. ప్రైవేటు సంస్థల్లో ఇలాంటివి తరచూ జరుగుతుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అప్పుడప్పుడు జరిగేదే ఇది. అయితే, కొందరు మాత్రమే సెలవు రోజుల్లో తమ పనులను పూర్తి చేసుకుంటూ విధులకు ఠంచనుగా హాజరవుతుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు సెలవులు తీసుకోవడం తప్పనిసరి.

అయితే, పుష్కర కాలంగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తే?.. వినడానికే భలేగా ఉంది కదూ! అవును.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు 12 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క సెలవు కూడా పెట్టకుండా హాజరవుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వానొచ్చినా వరదొచ్చినా ఆయనెప్పుడూ విధులకు డుమ్మాకొట్టలేదు. తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండ సమీపంలోని కారైక్కురిచ్చి మాస్టారు కలైయరసన్ ఘనత ఇది. 

సింతామణి గ్రామానికి చెందిన ఆయన కారైక్కురిచ్చి గ్రామంలోని హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన కాట్టుమన్నార్‌గుడి, సిలాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేశారు. 2014 నుంచి కారైక్కురిచ్చిలో పనిచేస్తున్న ఆయన ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. తన పనులను సెలవు రోజుల్లో పూర్తి చేసుకుంటూ వస్తున్న ఆయన విద్యార్థులు స్కూలుకు రావడానికి ముందే పాఠశాలలో వాలిపోతారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రన్ మాట్లాడుతూ.. కలైయరసన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. సెలవు రోజుల్లో ప్రభుత్వం తరపున పాఠశాలకు వచ్చే సంక్షేమ సాయాన్ని కూడా ఆయన విద్యార్థులకు అందిస్తారని చెప్పారు.

More Telugu News