ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయి: రాజ్యసభలో విజయసాయిరెడ్డి

  • రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
  • ప్రత్యేక హోదా అంశంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయన్న విజయసాయి
  • అందుకే 2014 ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాయని వెల్లడి
Viajayasai Reddy raised his voice in Rajya Sabha on special status for AP

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో గళం విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయని ఆక్రోశించారు. ప్రత్యేక హోదా అంశంలో ఆ రెండు పార్టీలు సంయుక్తంగా విఫలమయ్యాయని అన్నారు. అందుకే 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయని వెల్లడించారు. 

అది ఏపీ ప్రజల హక్కు..

ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కు అని ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతోందని, కానీ హోదా కోసం తాము పోరాటం కొనసాగిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీలు వచ్చినా, ప్రభుత్వం అనేది కొనసాగుతుందని, ఇచ్చిన హామీలను ఆ విధంగా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని అన్నారు. 

నవ్యాంధ్రప్రదేశ్ కు 10 సంవత్సరాల పాటు ప్రత్యేకహోదా కల్పిచాలని అప్పట్లో విపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా చెప్పారని విజయసాయి గుర్తుచేశారు. నాడు వెంకయ్య అభిప్రాయాన్ని కాంగ్రెస్ కూడా సమర్థించిందని తెలిపారు. ఆ తర్వాత, కేంద్రంలో కాంగ్రెస్ ఓటమిపాలై బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇచ్చిన హామీని మాత్రం మర్చిపోయిందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..  

అనంతరం, మూడు రాజధానుల అంశంపైనా ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. రాజధానిపై సంపూర్ణ అధికారం రాష్ట్రానిదేనని తెలిపారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించడంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన చేసినట్టు విజయసాయిరెడ్డి సభకు వివరించారు.

More Telugu News