Kotamreddy Sridhar Reddy: నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి

  • ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే నేరమా అన్న కోటంరెడ్డి
  • పార్టీ నుంచి బయటికి వస్తే ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యలు
  • అమరావతి రైతులు నెల్లూరు వస్తే వారిని కలవడం తప్పా అంటూ ఆగ్రహం
Kotamreddy held meeting with his followers

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా కోటంరెడ్డి నెల్లూరులో తన వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నుంచి తాను బయటికి రాగానే ఉలిక్కిపడుతున్నారని అన్నారు. 

ప్రజా సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. నెల్లూరు రూరల్ లో అనేక పథకాలకు నిధులు ఇవ్వడంలేదని కోటంరెడ్డి ఆరోపించారు. బారాషాహీద్ దర్గాకు రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వెల్లడించారు. అమరావతి రైతులు నెల్లూరు వస్తే, వారిని నేను కలవడం నేరమా? అని మండిపడ్డారు. 

కాగా, వైసీపీ అధినాయకత్వం ఆదాల ప్రభాకర్ రెడ్డిని కొన్నిరోజుల కిందటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించింది. కోటంరెడ్డి వ్యవహారం నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. 

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి బాహాటంగా కోటంరెడ్డికి మద్దతు పలికిన నేపథ్యంలో, ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. నెల్లూరు కార్పొరేషన్ లో 26 మంది కార్పొరేటర్లు ఉండగా, 18 మంది ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో ఆదాల మాట్లాడుతూ, కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఏదైనా సమస్య ఉంటే తనకే కాల్ చేయాలని స్పష్టం చేశారు. 

అటు, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ సహా 8 మంది కార్పొరేటర్లు కోటంరెడ్డి పక్షమేనని తెలుస్తోంది. కాగా, రేపు ఉదయం 10 గంటలకు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఉంటుందని కోటంరెడ్డి వెల్లడించారు. ఆయన నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.

More Telugu News