జగన్ మోసం చేయని వ్యక్తులు ఏపీలో ఎవరూ లేరు: నారా లోకేశ్

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ
  • జగన్ అసలు పేరు జగన్ మోసపు రెడ్డి అంటూ లోకేశ్ విమర్శలు
  • రాయలసీమకు పట్టిన శని అని వెల్లడి
Lokesh slams Jagan in Chittoor

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో చిత్తూరు టీడీపీ కార్యాలయం వద్ద లోకేశ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ అసలు పేరు జగన్ మోసపు రెడ్డి అని ఎద్దేవా చేశారు. జగన్ మోసం చేయనివాళ్లు ఏపీలో ఎవరూ లేరని అన్నారు. యువతను కూడా ఉద్యోగ ఉపాధి పేరిట మోసం చేశాడని తెలిపారు. 

జగన్ ఏపీలో అన్నీ పెంచుకుంటూ పోతున్నాడని, త్వరలోనే పీల్చే గాలి పైనా పన్ను వేస్తాడని వ్యంగ్యం ప్రదర్శించారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ వాస్తవానికి రాయలసీమకు పట్టిన శని అని లోకేశ్ అభివర్ణించారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి రాయలసీమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని, ఒక సాగునీటి పథకం గానీ, ఒక తాగునీటి పథకం కానీ పూర్తి చేశాడా? అని ప్రశ్నించారు. హంద్రీనీవా పూర్తి చేయలేదని, అమరరాజాను పక్క రాష్ట్రానికి పంపించేశాడని అన్నారు. 

"ఇప్పుడు జగన్ వై నాట్ 175 అంటూ తిరుగుతున్నాడు, కానీ ఇప్పుడు నేనడుగుతున్నా... వై నాట్ స్పెషల్ స్టేటస్, వై నాట్ కడప ఉక్కు ఫ్యాక్టరీ, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ కాలెండర్, వై నాట్ డీఎస్సీ, వై నాట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, వై నాట్ సీపీఎస్ రద్దు, వై నాట్ రైతులకు ఇవ్వాల్సిన గిట్టుబాటు ధరలు, వై నాట్ మా అవ్వా తాతలకు ఇవ్వాల్సిన రూ.3 వేల పెన్షన్, వై నాట్ అందరు పిల్లలకు ఇస్తానన్న అమ్మ ఒడి, వై నాట్ పెట్రోల్, డీజిల్ పై పెంచిన పన్ను" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు. 

జగన్ రెడ్డీ నువ్వు కలలు కంటూ ఉండడం కాదు... రా, బయటికి రా... పరదాలు లేకుండా రా... ప్రజల్లో ఉన్న బాధ, ఆవేదన నీకు అర్థమవుతుంది అని స్పష్టం చేశారు. గంజాయిలోనూ, శాండ్, లాండ్, వైన్, మైన్, అప్పుల్లో రాష్ట్రాన్ని జగన్ నెంబర్ వన్ చేశారని ఇటీవల తనను కలిసిన వైసీపీ నేత చెప్పాడని లోకేశ్ వెల్లడించారు. 

బాబాయ్ ని చంపింది అబ్బాయేనని, అందుకే సీబీఐ రా రా రా అంటూ పిలుస్తోందని, సీబీఐ పిలవగానే జగన్ ఢిల్లీ వెళతాడని విమర్శించారు. ఏనాడైనా ఎందుకు ఢిల్లీ వెళ్లాడో ఒక్కసారైనా చెప్పాడా అని లోకేశ్ నిలదీశారు. ఏపీ హక్కులపై, ప్రత్యేక హోదాపై ఏనాడైనా ప్రశ్నించాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ ని చంపిన వాళ్లను క్రిమినల్ అంటారని, ఆ క్రిమినల్ ఇప్పుడు జిల్లాకొక క్రిమినల్ ను తయారుచేశాడని అన్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మంత్రి పెద్దిరెడ్డిని కూడా టార్గెట్ చేశారు. "మన జిల్లాకు కూడా ఒక దొంగరెడ్డి ఉన్నాడు. ఆయన పేరు పెద్దిరెడ్డి. జిల్లాలో ఎక్కడ కుంభకోణం జరిగినా, ఎక్కడ ఇసుక మాఫియా జరిగినా దాని వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉంటుంది అని వివరించారు. 

"అంతేకాదు, ఇక్కడ మన చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే జేఎంసీ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయనను అడుగుతున్నా... అయ్యా నువ్వు శాసనసభ్యుడివా, భూబకాసురుడివా? కారులో వెళ్లేటప్పుడు చూస్తాడు... అక్కడ కొండ ఉన్నా, గుట్ట ఉన్నా, పేదల భూములు ఉన్నా, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల భూములు ఉన్నా సరే కబ్జా చేసేస్తాడు" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.

More Telugu News