Kim Jong Un: కిమ్ కనిపించుట లేదు!

  • గత 40 రోజులుగా అధికార కార్యక్రమాల్లో కనిపించని కిమ్
  • ఈ వారంలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవం
  • రాజధాని ప్యాంగ్ యాంగ్ లో సన్నాహాలు
  • అయినప్పటికీ జాడలేని కిమ్
Where is Kim Jong Un

కరోనా సంక్షోభం ముగిశాక ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు అధిక సంఖ్యలో చేపడుతుండడం ఒక కారణమైతే, స్వయంగా అమెరికా తదితర శత్రు దేశాలకు వార్నింగ్ లు ఇస్తూ కిమ్ ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు.

అయితే, ఇప్పుడు కిమ్ నుంచి గత 40 రోజులుగా ఎలాంటి ప్రకటన రాకపోగా, అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడంలేదు. కిమ్ ఆరోగ్యం బాగా లేదంటూ గతంలోనూ ప్రచారం జరిగింది. ఇప్పుడదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

మరి కొన్నిరోజుల్లో ఉత్తర కొరియాలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. రాజధాని ప్యాంగ్ యాంగ్ ప్రత్యేక పరేడ్ కోసం ముస్తాబవుతోంది. ఇంతటి విశిష్టమైన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతుంటే, కిమ్ ఎక్కడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

మొన్న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలోనూ కిమ్ జాడ లేదు. అయితే నిన్న జరిగిన మిలిటరీ కమిషన్ సమావేశానికి కిమ్ వచ్చారని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ ప్రకటించినా, అందుకు సంబంధించిన ఫొటోలను మాత్రం విడుదల చేయలేదు. దాంతో, సందేహాలు అలాగే మిగిలిపోయాయి.

More Telugu News