cars: 7 లక్షల లోపు ఖరీదులో ఆటోమేటిక్ కార్లు.. వివరాలు ఇవిగో!

  • మారుతి కంపెనీ నుంచే మూడు కార్లు
  • తక్కువ బడ్జెట్ లో అందుబాటులో ఉన్న ఆల్టో కె10, ఎస్ ప్రెస్సో, సెలెరియో కార్లు
  • మైలేజీలోనూ టాప్ లో ఉన్న మారుతి కార్లు
  • తక్కువ ధరలో శక్తిమంతమైన కార్లలో టియాగో ఒకటి
 Cheapest Automatic Cars Under 7 Lakhs Here is the list

తక్కువ ఖరీదులో ఆటోమేటిక్ కారు కొనాలని చూస్తున్నారా.. అయితే, ఈ వివరాలపై ఓసారి దృష్టిసారించండి. రూ.7 లక్షల లోపు బడ్జెట్ లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆటోమేటెడ్ కార్లలో కొన్నింటి వివరాలు మీకోసం.. మారుతి ఆల్టో కె10, మారుతి ఎస్ ప్రెస్సో, సెలెరియో, రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్, టాటా టియాగో తదితర కార్లు తక్కువ బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్ కార్ల సెగ్మెంట్ లో తక్కువ ధరలో మారుతి కంపెనీ నుంచే మూడు ఆటోమేటిక్ కార్లు ఉండడం విశేషం. ఆయా కార్ల విశేషాలను పరిశీలిస్తే..

సుజుకి ఆల్టో కె10..
ఆటోమేటిక్ కార్ల సెగ్మెంట్ లో మన దేశంలో అత్యంత చౌక ధరకు లభిస్తున్న కారు ఆల్టో కె 10. ప్రస్తుతం ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.84 లక్షలుగా ఉంది. ఇందులో వీఎక్స్ఐ ప్లస్ ఏటీ వేరియంట్ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.88 లక్షలుగా ఉంది. 998 సీసీ పెట్రోల్ వేరియంట్ కారు లీటరు పెట్రోల్ తో 24.9 కిలోమీటర్లు పరిగెడుతుంది. ఇందులో 7 అంగుళాల స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఎస్ ప్రెస్సో..
మారుతి ఎస్ ప్రెస్సో ఆటోమేటిక్ వేరియంట్ లో బేస్ మోడల్ మిగతా వాటితో పోలిస్తే ఖరీదు తక్కువ. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.74 లక్షలుగా ఉంది. ఇక టాప్ స్పెక్ ఆటోమేటిక్ వేరియంట్ విషయానికి వస్తే.. రూ.6.04 లక్షలు. ఈ కారు కూడా 998 సీసీ పెట్రోల్ ఇంజన్ తో తయారైంది. మైలేజీ లీటర్ పెట్రోల్ కు 21.7 కిలోమీటర్లు.

సెలెరియో..
మారుతి కంపెనీ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరో బెస్ట్ ఆటోమేటిక్ కారు సెలెరియో. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.6.37 లక్షలుగా ఉంది. ఇది వీఎక్స్ఐ ఏఎంటీ వేరియంట్.. జెడ్ఎక్స్ఐ ఏఎంటీ వేరియంట్ ధర రూ.6.65 లక్షలు (ఎక్స్ షోరూం). ఇది కూడా 998 సీసీ ఇంజన్ తో లీటర్ పెట్రోల్ కు 26 కిలోమీటర్ల దూరం పరుగులు తీస్తుంది.

రెనాల్ట్ క్విడ్..
రెనాల్ట్ క్విడ్ ఆటోమేటిక్ వెర్షన్ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.61 లక్షలు కాగా, టాప్ స్పెక్ మోడల్ ధర రూ.5.83 లక్షలు (ఎక్స్ షోరూం) గా ఉంది. క్విడ్ కారు ఇంజన్ 999 సీసీ సామర్థ్యం కలిగి ఉంది. లీటర్ పెట్రోలుకు 22 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

టాటా టియాగో..
టియాగో ఆటోమేటిక్ వేరియంట్ కారు ఎక్స్ షోరూం ధర రూ.6.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్పెసిఫికేషన్లు, మోడల్స్ ను బట్టి ధర పెరుగుతుంది. ఆటోమేటిక్ వెర్షన్ లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న శక్తిమంతమైన కార్లలో టియాగో ఒకటి. దీనికి 1199 సీసీ ఇంజన్ ను కంపెనీ అమర్చింది. ఇక మైలేజీ విషయానికి వస్తే.. లీటర్ పెట్రోల్ కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఎక్స్ షోరూం ధరలకు ఆయా బ్రాండులను బట్టి ఆన్ రోడ్ ధరలు (రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్, యాక్సిసరీస్ వంటివి) వుంటాయి.

More Telugu News