240 కి.మీ. వేగంతో ల్యాండింగ్.. రెండున్నర సెకండ్లలోనే ఆగిన జెట్.. వీడియో ఇదిగో!

  • ఐఎన్ఎస్ విక్రాంత్ పై తేజస్ ల్యాండింగ్ 
  • విజయవంతంగా పరీక్షించిన నేవీ అధికారులు
  • దేశీయంగా తయారుచేసిన విమానవాహక నౌకపై చారిత్రాత్మక ఘటన
tejas jet landed on ins vikranth

భారత దేశంలో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా దూసుకెళ్లే ఫైటర్ జెట్ ఈ నౌకపై విజయవంతంగా ల్యాండయింది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో నౌక రన్ వేపై దిగిన ఫైటర్ జెట్.. కేవలం 2.5 సెకండ్లలోనే నౌకపై ఆగింది. ఈ ఘనత సాధించిన ఫైటర్ జెట్ తేజస్ కూడా మన దేశంలోనే తయారవడం విశేషం!

తేజస్ ఫైటర్ జెట్ ను ప్రయోగాత్మకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ పై ల్యాండ్ చేయడం అత్యంత టెన్షన్ తో కూడుకున్న పని అని విశ్రాంత నేవీ అధికారి జైదీప్ మౌలాంకర్ పేర్కొన్నారు. మౌలాంకర్ గతంలో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపారు. యుద్ధ విమాన వాహన నౌకలపై తేజస్ ను గతంలో ఆయన విజయవంతంగా ల్యాండ్ చేశారు. అయితే, ఐఎన్ఎస్ విక్రాంత్ దేశీయంగా తయారుకావడం, దీనిపై ఏర్పాటు చేసిన రన్ వే మిగతా వాటితో పోలిస్తే చిన్నది కావడంతో  అధికారవర్గాల్లో టెన్షన్ నెలకొనడం సాధారణమేనని చెప్పారు.

ల్యాండింగ్ సమయంలో తేజస్ జెట్ వేగం చాలా ఎక్కువగా ఉంటుందని, దానిని క్షణాల వ్యవధిలో జీరో వేగానికి తగ్గించడం అత్యంత క్లిష్టమైన పని అని మౌలాంకర్ చెప్పారు. సముద్రంలో క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య నౌకలపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయడం సవాళ్లతో కూడుకున్న విషయమని మౌలాంకర్ చెప్పారు. పైలట్లు అత్యంత జాగ్రత్తగా, జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుందని వివరించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి తక్కువ పొడవున్న రన్ వే పై, అదీ సముద్రంలో ల్యాండ్ కావడం మామూలు విషయం కాదన్నారు.

జెట్ ఫైటర్లు చాలా వేగంతో దూసుకెళతాయని మౌలాంకర్ గుర్తుచేశారు. ల్యాండింగ్ సమయంలో వేగాన్ని తగ్గించినా.. విమానం రన్ వేను తాకే సమయంలో 240 కిలోమీటర్ల వేగంతో ఉంటుందన్నారు. ఈ స్థాయిలో ఉన్న వేగాన్ని క్షణాలలో పూర్తిగా తగ్గించి, జెట్ ను నిలపడం చాలా కష్టమైన విషయమని వివరించారు. తాజాగా నేవీ నిర్వహించిన ఫైటర్ జెట్ తేజస్ ల్యాండింగ్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతం కావడం సంతోషకరమని మౌలాంకర్ పేర్కొన్నారు.

More Telugu News