Harvard Law Review Publication: ప్రఖ్యాత హార్వర్డ్ ‘లా రివ్యూ’ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ

  • పబ్లికేషన్‌ చరిత్రలో తొలిసారిగా భారత సంతతి వ్యక్తి అప్సరకి పగ్గాలు
  • అధ్యక్ష బాధ్యత దక్కడంపై అప్సర హర్షం
  • పత్రిక ప్రతిష్ఠ ఇనుమడింప జేస్తానని ప్రకటన
Indian American Woman To Head Harvard Law Review

అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ లా స్కూల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అప్సర అయ్యర్ చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ లా రివ్యూ పబ్లికేషన్‌కు 137వ అధ్యక్షురాలిగా సోమవారం ఎన్నికయ్యారు. 136 ఏళ్ల పబ్లికేషన్ చరిత్రలో ఓ భారత సంతతి వ్యక్తి ఈ బాధ్యత చేపట్టడం ఇదే తొలిసారి. విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పత్రికకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, అమెరికా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రూత్ బదేర్ గిన్స్‌బర్గ్ సైతం గతంలో దీనికి నేతృత్వం వహించారు. 

లా రివ్యూ అధ్యక్షురాలిగా ఎన్నికవడంపై అప్సర అయ్యర్ హర్షం వ్యక్తం చేశారు. పబ్లికేషన్ ప్రతిష్ఠ ఇనుమడింప జేస్తానని ఆమె అన్నారు. పబ్లికేషన్‌లో కథనాల ఎంపిక, పరిశీలన ప్రక్రియలో మరింత మంది ఎడిటర్లను భాగస్వాములను చేస్తానని కూడా పేర్కొన్నారు. కాగా..అప్సర గతంలో లా స్కూల్‌కు చెందిన హార్వర్డ్ రైట్స్ జర్నల్, నేషనల్ సెక్యూరిటీ జర్నల్‌కు సంబంధించిన అంశాల్లోనూ సేవలందించారు. అప్సర అయ్యర్ 2016లో యేల్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రం, గణిత శాస్త్రం, స్పానిష్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

More Telugu News