bihar: బీహార్ లో మాయమైన రైల్వే ట్రాక్!

  • స్క్రాప్ కింద అమ్మేసి సొమ్ముచేసుకున్న దొంగల ముఠా
  • మోసానికి సహకరించిన ఆర్ పీఎఫ్ సిబ్బందిపై వేటు
  • విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు 
Railway Track Worth Crores Illegally Sold To Scrap Dealer In Bihar

చాలాకాలంగా మూతపడ్డ రైల్వే ట్రాక్ చోరీకి గురైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. కాపలాగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎఫ్) సిబ్బంది చేతివాటం దొంగలకు కలిసొచ్చింది. మొత్తంగా అక్కడొక ట్రాక్ ఉండేదనే ఆనవాళ్లు కూడా లేకుండా మాయం చేశారు. తాజాగా ఈ విషయం బయటపడడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అక్కడి సిబ్బందిలో ఇద్దరిపై అప్పటికప్పుడు వేటు వేశారు. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించి, నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ మిల్ ఉంది. ఈ ఫ్యాక్టరీకి రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్ ను వేసింది. అయితే, ఈ మిల్ మూతపడడంతో ఆ ట్రాక్ నిరుపయోగంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు కూడా ఆ ట్రాక్ ను పట్టించుకోవడం లేదు.

ఇలా నిరుపయోగంగా మారిన ట్రాక్ ను రైల్వే శాఖ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, స్క్రాప్ కింద అమ్మేయాలి. కానీ ఈ ట్రాక్ విషయంలో అలాంటివేవీ జరగలేదు. ట్రాక్ మాత్రం మాయమైంది. ప్రాథమిక విచారణలో కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి, ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో ట్రాక్ ను అమ్మేసి సొమ్ము చేసుకున్నారని తేలింది. ట్రాక్ చోరీకి గురైందన్న సమాచారం తెలిసి రైల్వే ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. బాధ్యులలో ఇద్దరు అధికారులను వెంటనే సస్పెండ్ చేశారు.

More Telugu News