బెలూన్ శకలాలను చైనాకు ఇచ్చేది లేదు: అమెరికా

  • అట్లాంటిక్ మహా సముద్రంలో పడిపోయిన బెలూన్ శకలాలు
  • వెలికితీత పనులు మొదలయ్యాయన్న అధికారులు
  • వాతావరణం అనుకూలించక నెమ్మదిగా సాగుతున్న గాలింపు
No Intention To Return Balloon Debris To China says usa officials

తమ గగనతలంలోకి ప్రవేశించిన చైనా బెలూన్ ను గూఢచర్య పరికరమని ఆరోపించిన అమెరికా.. ఆ బెలూన్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే! అట్లాంటిక్ సముద్రంలో కూలిన బెలూన్ శకలాలను గుర్తించి, వెలికి తీసే పనిలో అమెరికా అధికారులు నిమగ్నమయ్యారు. సముద్రంలో తేలియాడుతున్న కొన్ని పరికరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. నీటిలో మునిగిన శకలాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 

వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ వెలికితీత పనుల్లో జాప్యం జరుగుతుందని వివరించారు. ఈమేరకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. చైనా గూఢచర్య బెలూన్ శకలాలను వెలికి తీసే పనులు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. వాతావరణం అనుకూలించగానే సముద్రం అడుగున పడిపోయిన శకలాలను గుర్తించి, వెలికి తీస్తామని చెప్పారు. 

బెలూన్ శకలాలను చైనాకు అప్పగించే ఉద్దేశమేమీ తమకు లేదని వైట్ హౌజ్ సోమవారం ప్రకటించింది. బెలూన్ ను తమ గగనతలంలోకి పంపించి చైనా గూఢచర్యానికి పాల్పడిందని, ఇది కవ్వింపుచర్యేనని జాన్ కిర్బీ తేల్చిచెప్పారు. అమెరికా భూభాగంలోని కీలక మిలటరీ స్థావరాలు, రక్షణ శాఖకు చెందిన కీలక ప్రాంతాల పైనుంచి చైనా బెలూన్ ప్రయాణించిందని వివరించారు.

అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బెలూన్ ను రూపొందించారని, ఇది తప్పకుండా గూఢచర్యం చేయడానికే తమ గగనతలంలోకి ప్రవేశించిందని చెప్పారు. ఇది సేకరించిన సమాచారం ఏంటనేది ఆ శకలాలను పరిశీలించాకే తెలుస్తుందని, అందుకే శకలాలను వీలైనంత తొందరగా వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కిర్బీ తెలిపారు.

More Telugu News