అతనిని చేసుకోవాలా? వద్దా?.. యువతి ప్రశ్న.. ఆన్‌లైన్‌లో విపరీత చర్చ!

  • మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే అబ్బాయితో కుదిరిన వివాహం 
  • పెళ్లి ఫిక్సయ్యాక పోయిన ఉద్యోగం
  • డైలమాలో పడిపోయిన అమ్మాయి
  • రెండుగా విడిపోయిన సోషల్ మీడియా
Social Media Split into two over a woman question

ఓ యువతి అడిగిన ప్రశ్న ఆన్‌లైన్‌లో విపరీత చర్చకు కారణమైంది. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడిని తాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఇప్పుడతడి ఉద్యోగం పోయిందని చెప్పిన ఆ యువతి.. తానిప్పుడు అతడిని పెళ్లి చేసుకోవచ్చా? అని ప్రశ్నించింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని, ఫిబ్రవరిలోనే ముహూర్తమని ఆమె పేర్కొంది. 

అయితే, తనకు కాబోయే వాడిని మైక్రోసాఫ్ట్ అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించిందని, తన కుటుంబానికి కూడా ఈ విషయం తెలుసని వివరించింది. అయితే, ఉద్యోగం కోల్పోయిన అతడిని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అన్న విషయలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నానని, మరి అతడిని తాను పెళ్లి చేసుకోవచ్చా? అని సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. అంతేకాదు, మైక్రోసాఫ్ట్‌లో అతడి వేతనం రూ. 2.5 లక్షలుగా ఉండేదని కూడా చెప్పింది.

సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టు వైరల్ అయింది. ఈ పోస్టుపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు యువకుడికి మద్దతిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధాలు వ్యాపార లావాదేవీల్లా మారిపోయాయని, కాబట్టి దీనిని కూడా అదే కోణంలో చూడాలని కొందరంటే, అతడికి నీ కంటే మంచి వ్యక్తి దొరుకుతాడని మరికొందరు కామెంట్ చేశారు. 

కాగా, టెక్ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను వరసపెట్టి తొలగిస్తున్నాయి. ట్విట్టర్‌తో మొదలైన ఉద్యోగాల ‘ఊచకోత’ అన్ని కంపెనీలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గత నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

More Telugu News