Victoria Gowri: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం

Controversy looms on Victoria Gowri appointment as Madras High Court Additional Judge
  • దేశంలోని హైకోర్టుల్లో 13 మంది జడ్జిల నియామకం
  • ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు
  • ఆమోదం తెలిపిన కేంద్రం
  • గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా విక్టోరియా గౌరి
  • ముస్లింలపై, క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర
ఇటీవల దేశంలోని పలు హైకోర్టుల్లో 13 మంది న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు చేయడం తెలిసిందే. ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదం లభించడంతో న్యాయమూర్తుల నియామకాలు షురూ అయ్యాయి. అయితే, మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా విక్టోరియా గౌరి నియామకం వివాదం రూపు దాల్చింది. 

సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు, ముస్లింలు, క్రైస్తవులపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. 

ఈ నేపథ్యంలో, విక్టోరియా గౌరి నియామకాన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయవాదులు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు. అంతేకాదు, మద్రాస్ హైకోర్టులో ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. 

ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. దీన్ని వచ్చే వారం విచారించే కేసుల జాబితాలో చేర్చుతామని చెప్పగా, ఈ అంశంపై త్వరితగతిన విచారణ జరపాల్సిన అవసరం ఉందని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో, పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు వచ్చేలా లిస్టింగ్ చేస్తామని సీజేఐ తెలిపారు.
Victoria Gowri
Additional Judge
Madras High Court
Supreme Court Collegium

More Telugu News