Chhattisgarh: ఇంట్లో నుంచి లాక్కొచ్చి.. బీజేపీ నేతను నరికి చంపిన మావోయిస్టులు

Chhattisgarh BJP Leader Dragged From Home Killed By Maoists Before Family
  • చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో కుటుంబ సభ్యులు, గ్రామస్థుల ఎదుటే దారుణం
  • గొడ్డళ్లు, పదునైన ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి
  • ఘటనకు సంబంధించిన వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి వెళ్లి బీజేపీ నేతను బయటికి లాక్కొచ్చిన మావోలు.. కుటుంబ సభ్యుల ఎదుటే దాడి చేశారు. విచక్షణా రహితంగా నరికి చంపేశారు. 

బీజాపూర్ లోని ఉసూర్ బ్లాక్ బీజేపీ ప్రెసిడెంట్ గా 15 ఏళ్లుగా నీలకంఠ్ కక్కెమ్ పనిచేస్తున్నారు. ‘‘తన పూర్వీకుల గ్రామమైన పైక్రమ్ లో పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లారు. అక్కడికి వచ్చిన నిషేధిత సీపీఐ(ఎం)కు చెందిన మవోయిస్టులు.. గొడ్డళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో నీలకంఠ్ పై దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు’’ అని ఏసీపీ చంద్రకాంత్ గవర్న చెప్పారు.

ఆవపల్లి పోలీస్ స్టేషన్ పరధిలోని పైక్రమ్ లో మావోయిస్టులు ఒకరిని చంపారని తమకు సమాచారం అందిందని, వెంటనే అక్కడికి చేరుకున్నామని ఏసీపీ చంద్రకాంత్ చెప్పారు. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దాడి చేసేందుకు దాదాపు 150 మంది మావోయిస్టులు వచ్చినట్లు తెలిసిందన్నారు. అందరూ సాధారణ దుస్తుల్లోనే వచ్చారని, ముగ్గురు మాత్రమే బీజేపీ నేత ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని వివరించారు. 

‘‘ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నీలకంఠ్ ను లాక్కెళ్లారు. మా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలందరి ముందే నరికి చంపారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు’’ అని నీలకంఠ్ భార్య లలిత కక్కెమ్ చెప్పారు.
Chhattisgarh
Maoists
Dragged
BJP Leader
Bijapur

More Telugu News