Pervez Musharaff: ముషారఫ్‌పై శశిథరూర్ ట్వీట్ వివాదాస్పదం.. మండిపడ్డ బీజేపీ

  • భారత్‌కు శత్రువైన ముషారఫ్ తరువాత శాంతి శక్తిగా మారారన్న థరూర్
  •  భారత సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని ఎలా ప్రశంసిస్తారంటూ బీజేపీ ఫైర్
  • వాజ్‌పేయి-ముషారఫ్ చర్చల ప్రస్తావనతో థరూర్ కౌంటర్
backlash over Shashi Tharoors tweet on Musharraf

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ మరణంపై సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ముషారఫ్‌ భారత్‌తో శాంతి కోసం యత్నించారన్న థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని ఎలా ప్రశంసిస్తారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. 

భారత్‌-పాక్ కార్గిల్ యుద్ధానికి కారణమైన ముషారఫ్ దుబాయిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశిథరూర్ సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు భారత్‌కు శత్రువైన ఆయనే 2002-07 మధ్య కాలంలో శాంతి స్థాపనకు శక్తిగా మారారు. అప్పట్లో ఐరాసలో ఆయనను ఏటా కలుస్తుండేవాడిని. ఆయన నాకు తెలివిగా, వ్యూహాత్మకంగా ఉన్నట్టు కనిపించేవారు’’ అంటూ థరూర్ సంతాపం తెలిపారు. 

ఈ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. శశిథరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ‘‘భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసి, అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా మన దేశ సైనికులను హింసించిన వ్యక్తిలో మీరు శాంతిని వెతుకుతున్నారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై శశిథరూర్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 2003లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ముషారఫ్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2004 నాటి వాజ్‌పేయి-ముషారఫ్ సంయుక్త ప్రకటననూ ప్రస్తావించారు. ‘‘నాటి కాల్పుల విరమణపై చర్చల్లో ఆయన మీకు విశ్వసనీయమైన భాగస్వామిగా కనిపించారా?’’ అంటూ సూటి ప్రశ్న వేశారు.

More Telugu News