Anand Mahindra: ప్రాణాలను రక్షించే ఈ ఉత్పత్తి తప్పకుండా తయారీలోకి రావాలి: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra wants companies to manufacture this inflatable safety device to jump out of buildings on fire
  • అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగితే బయటపడే మార్గం
  • ఇన్ ఫ్లేటబుల్ బ్యాక్ ప్యాక్ ఉత్పత్తిని పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా
  • ఇదొక ముఖ్యమైన కొనుగోలు అవుతుందని పోస్ట్
పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చారు. తాజాగా తన ట్విట్టర్ పేజీలో ఓ యానిమేటెడ్ వీడియో పోస్ట్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగితే పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లలోని ఫ్లాట్ల నుంచి బయటపడేందుకు వీలుగా ఇందులో ఇన్ ఫ్లేటబుల్ సేఫ్టీ బెలూన్ కనిపిస్తుంది.

బ్యాక్ ప్యాక్(షోల్డర్ బ్యాగ్) మాదిరిగా ఉండే దీన్ని భుజానికి తగిలించుకొని.. గ్రిల్స్ లేని విండో లేదంటే మేడపైకి వెళ్లి పిట్ట గోడ మీద కూర్చోవాలి. బ్యాక్ ప్యాక్ నుంచి బెలూన్ పెద్దదయ్యేలా స్విచ్ ఆన్ చేయాలి. దీంతో పెద్ద పరిమాణంలో బెలూన్ తెరుచుకుంటుంది. కిందకు దూకేస్తే క్షేమంగా నేలపై ల్యాండ్ కావచ్చు. 

‘‘ఇది నిజమేనని నేను ఆశిస్తున్నాను. ఏదో ఒక కంపెనీ దీన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఒకవేళ నేను ఎత్తయిన భవన సముదాయంలో ఉండేట్టు అయితే ఇదొక ముఖ్యమైన కొనుగోలు అవుతుంది. ఎంతో ఇన్నోవేటివ్ గా ఉంది’’ అని మహీంద్రా తన స్పందనను వ్యక్తం చేశారు. ఇలాంటి వినూత్న విషయాలను ఆనంద్ మహీంద్రా తరచూ కోట్లాది మందితో ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఉంటారు. 

ఆనంద్ మహీంద్రా పోస్ట్ చూసి యూజర్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అనిల్ దియో అనే ఒక యూజర్ అయితే, ‘‘సర్, మీరు పోస్ట్ చేసింది విడిగా ఒక్కొక్కరి కోసం. కానీ, ఇది అయితే అపార్ట్ మెంట్ లో ఉన్న అందరికీ ఉపయోగకరం’’ అంటూ మరో వినూత్న ఆవిష్కరణ వీడియోని పోస్ట్ చేశాడు. ఇందులో అత్యవసర సమయంలో అపార్ట్ మెంట్ బాల్కనీ వైపు నుంచి బయటపడే విధంగా మెట్లతో కూడిన చైన్ తెరుచుకుంటుంది. 


Anand Mahindra
Twitter
inflatable safety device
fire accident

More Telugu News