కాణిపాకంలో వరసిద్ధి వినాయక ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • పూతలపట్టు నియోజవకర్గంలో పాదయాత్ర
  • లోకేశ్ ను కలిసిన ఆశా వర్కర్ల ప్రతినిధులు
  • మెరుగైన భవితకు యువతకు భరోసా ఇచ్చిన లోకేశ్
Nara Lokesh offers special prayers at Kanipakam Vinayaka Temple

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇవాళ లోకేశ్ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అర్చకులు లోకేశ్ కు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. 

కాగా, పాదయాత్ర సందర్భంగా కాణిపాకం వచ్చిన లోకేశ్ ను ఆశా వర్కర్లు కలిశారు. ఆశావర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లపై ప్రభుత్వం తీవ్రమైన పనిభారం మోపుతోందని వాపోయారు. విధినిర్వహణలో అనారోగ్యం పాలై చాలామంది అర్ధంతరంగా చనిపోతున్నారని వివరించారు. 

ప్రభుత్వం ఆశావర్కర్లకు 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆశావర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను పర్మినెంట్ చేసి, కనీస వేతనంగా రూ. 26 వేలు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు, వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులు ఇవ్వాలని, విధినిర్వహణలో మృతిచెందిన వారికి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ గా రూ.5 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని ఆశా వర్కర్ల ప్రతినిధులు పేర్కొన్నారు. 

62 సంవత్సరాల రిటైర్మెంట్ జీవో వర్తింపజేయాలని, ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీల నియామకల్లో వెయిటేజి ఇవ్వాలని తెలిపారు. కోవిడ్ కాలంలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అన్నారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... గ్రామీణ ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆశావర్కర్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఆశావర్కర్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఆశావర్కర్ల సమస్యల పరిష్కరానికి కృషిచేస్తామని వారికి హామీ ఇచ్చారు. 

కాణిపాకంలో పాదయాత్ర సందర్భంగా లోకేశ్ యువతతోనూ భేటీ అయ్యారు. జగన్ అబద్ధపు హామీలతో మోసపోయామని, రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకి వలస వెళ్తున్నామని నిరుద్యోగులు లోకేశ్ కు తమ బాధలు చెప్పుకున్నారు. అమరరాజా తెలంగాణకి వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత తీవ్రంగా నష్టపోయినట్టు వివరించారు. ప్రతి ఏటా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం వయోపరిమితి మాత్రం పెంచడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ బదులిస్తూ... పరిపాలన ఒకే చోట... అభివృద్ది వికేంద్రకరణ అనేది తమ నినాదం అని స్పష్టం చేశారు. అభివృద్ది వికేంద్రకరణ చేసి చూపించామని వెల్లడించారు. 

అమరావతికి రాజధాని, రాయలసీమకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ పరిశ్రమలు తీసుకొచ్చామని, విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చామని వివరించారు. పేదరికం లేని రాష్ట్రం ఏర్పాటు తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. 

అటు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉందని, టీడీపీ గెలిచిన వెంటనే కేజీ టూ పీజీ వరకూ సిలబస్ మారుస్తామని వెల్లడించారు. టాలెంట్ ఉన్న యువత ఉంటేనే కంపెనీలు వస్తాయి... అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ మా బాధ్యత అని లోకేశ్ భరోసా ఇచ్చారు. 

ఏంఎస్ఎంఈ అభివృద్ది కోసం ఎన్నో ప్రోత్సాహకాలు టీడీపీ హయాంలో ఇచ్చామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఏంఎస్ఎంఈని దెబ్బతీసిందని విమర్శించారు. "చంద్రబాబు ఉన్నప్పుడు ఏపీ జాబ్ క్యాపిటల్ గా ఉండేది. జగన్ పాలనలో ఏపీ డ్రగ్ క్యాపిటల్ గా మారింది. 

చంద్రబాబు పాలనలో కియా కారు చూస్తే ఏపీ గుర్తు వచ్చేది... జగన్ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి బండి పట్టుకున్నా ఏపీ గుర్తొస్తోంది. వైసీపీ పాలనలో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చెయ్యలేదు. జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబు రావాలి అంటే బాబు రావాలి. సైకో పోవాలి... సైకిల్ రావాలి" అంటూ లోకేశ్ పేర్కొన్నారు.

More Telugu News