58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..హత్య..

  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • మహిళపై హత్యాచారానికి తెగబడ్డ టీనేజర్
  • రెండేళ్ల నాటి ఘటనకు ప్రతీకారం
Madhyapradesh teenager rapes and kills a 58 old woman in rewa district

మధ్యప్రదేశ్‌ రేవా జిల్లాల్లో తాజాగా ఓ దారుణం వెలుగుచూసింది. యాభైఎనిమిదేళ్ల మహిళను పదహారేళ్ల టీనేజర్ అత్యాచారం చేసి చంపేశాడు. జనవరి 30న ఖైలాష్‌పురి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం ఆ టీనేజర్‌ తమ సెల్ ‌ఫోన్ దొంగిలించాడని మృతురాలి కుటుంబం ఆరోపించడంతో అతడు ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నట్టు స్థానిక పోలీసులు ఆదివారం వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న భవనంలోనే బాధితురాలు తన కుటుంబంతో కలిసి నివసించేది. జనవరి 30న ఇంట్లో ఆమె భర్త, కుమారుడు లేని సమయంలో నిందితుడు ప్రవేశించాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న బాధితురాలికి మెలకువ వచ్చి అరిచేందుకు ప్రయత్నించడంతో ఆమె నోట్లో గుడ్డలు, ప్లాస్టిక్ బ్యాగ్ కుక్కాడు. ఆ తరువాత.. బాధితురాలి మొహంపైన ప్లాస్టిక్ బ్యాగ్ కప్పి భవంతిలో నిర్మాణం పనులు జరుగుతున్న చోటికి లాక్కెళ్లాడు. ఆపై ఆమెను తలుపుకు కట్టేసి, పదే పదే కొట్టాడు. ఈ క్రమంలో ఆమె ఊపిరాడక మూర్ఛపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం కొడవలితో ఆమెపై దాడి చేసి చంపేశాడు. చివరకు మహిళ ఇంట్లో ఉన్న రూ.1000 నగదు, బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. 

ఫిబ్రవరి 1న కొందరు స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సందర్భంగా.. మహిళ కుటుంబం, యువకుడి మధ్య నెలకొన్న వివాదం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో వారు నిందితుడిని వెతికిపట్టుకుని ప్రశ్నించగా.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. దొంగతనం చేశాడని మహిళ కుటుంబం ఆరోపించడంతో గ్రామంలో తన పరువు పోయినట్టు భావించిన టీనేజర్ ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 

More Telugu News