మా ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ?.. అఖిలప్రియపై శిల్పా రవి విమర్శలు

  • హైదరాబాద్ డెవలప్ అయ్యే ప్రాంతాల్లో భూమి కొన్నామన్న శిల్పా రవి
  • ఎదుటి వారిపై ఈర్ష్య పడటం కంటే వాస్తవాలు తెలుసుకోవాలని వ్యాఖ్య
  • నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ, శిల్పా రవి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
mla shilpa ravi counters bhuma ahilapriya

నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శిల్పా రవి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అఖిలప్రియ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు శిల్పా రవి కౌంటర్ ఇచ్చారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ? అని ప్రశ్నించారు. ‘‘మెడికల్ కాలేజీ వస్తుందని 50 ఎకరాలు ఇన్‎సైడ్ ట్రేడింగ్ చేశారని అఖిలప్రియ ఆరోపించారు. మాకు ఉన్నది 30 ఎకరాలు మాత్రమే.. మిగతా 20 ఎకరాలు ఎవరైనా తీసుకోవచ్చు. ఉన్న 30 ఎకరాలు కూడా ఒకే దగ్గర లేవు. మా నాన్న ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు.

హైదరాబాద్ డెవలప్ అయ్యే ప్రాంతాల్లో తాము భూమి కొన్నామని, తమ ఆస్తుల విలువ పెరిగితే బాధ ఎందుకని ప్రశ్నించారు. ‘‘కందుకూరులో మీరు 200 ఎకరాలు కొన్నారు. మీ ఆస్తుల విలువ పెరిగితే మేం బాధపడుతున్నామా? ఎదుటి వారిపై ఈర్ష్య పడటం కంటే వాస్తవాలు తెలుసుకోండి’’ అని హితవు పలికారు.

More Telugu News