మరో 232 యాప్‌లను నిషేధించనున్న కేంద్రం.. చైనా లింకులే కారణం..

  • మరోమారు చైనా యాప్‌లపై గురిపెట్టిన కేంద్రం
  • మొత్తం 232 యాప్‌లపై నిషేధానికి సిద్ధం
  • వీటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు..
In a major move govt initiates the process to ban apps with china links

చైనాతో సంబంధాలున్న పలు యాప్‌లను నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైంది. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆ యాప్‌లను నిషేధించాలంటూ కేంద్ర హోం శాఖ నుంచి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సమాచారం వెళ్లిందని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ యాప్స్‌.. ప్రజలను అప్పుల ఊబిలోకి దించడంతో పాటూ గూఢచర్య సాధనాలుగా మారే ఆస్కారం కూడా ఉందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీటితో దేశ ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించాయి.  

ప్రభుత్వం ఆరు నెలల క్రితమే 288 చైనా లోన్‌ యాప్‌లపై సమీక్ష ప్రారంభించింది. వీటిలో 94 యాప్‌లు వివిధ ఈ-స్టోర్లలో అందుబాటులో ఉండగా మిగిలినవి థర్డ్ పార్టీ లింక్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తేల్చింది. సర్వర్ సైడ్ భద్రతా వ్యవస్థల దుర్వినియోగంతో ఈ యాప్‌లను గూఢచర్య సాధనాలుగా మార్చొచ్చని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా దేశ ప్రజల సమాచారం విద్రోహశక్తులకు చేరితే.. యావత్ దేశంపై నిఘా పెట్టే అవకాశం ఉందని అన్నారు. వీటిని నిషేధించాలని తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు గతంలోనే హోం శాఖను కోరినట్టు సమాచారం. 

పరిశీలకులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ యాప్‌ల సృష్టికర్తలందరూ చైనా దేశస్తులే. భారత్‌లో యాప్‌ కార్యకలాపాల కోసం వారు ఇక్కడి వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని లోన్‌ల వైపు ఆకర్షించాక.. వడ్డీ రేట్లను అమాంతం 3000 శాతం మేరకు ఈ యాప్‌లు పెంచేస్తున్నాయి. ఫలితంగా లోన్‌లు చెల్లించలేకపోయిన వారిపై యాప్‌‌ల సిబ్బంది వేధింపులకు దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఈ యాప్‌ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో చైనా కుతంత్రాలు వెలుగులోకి వచ్చాయి.

More Telugu News